- హెచ్1బీ వీసా ద్వారానే అది సాధ్యం
- టిక్‌టాక్‌ను మస్క్ కొనుగోలు చేస్తే నాకు ఓకే
- మీడియా సమావేశంలో ట్రంప్
వాషింగ్టన్, జనవరి 22: సమర్థవంతమైన ప్రజలు అమెరికాకు రావాలని తాను కోరుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హెచ్1బీ వీసాల ద్వారా ఇది సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ మంగళవారం శ్వేతసౌధంలో ఒరాకిల్ సీటీవో లారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తదితరులతో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
హెచ్1బీ వీసాల విస్తరణపై సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా ఆ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయన్నారు. అయితే, సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కేవలం ఇంజనీర్లను గురించి మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు.
అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో పెట్టుకునే చెబుతున్నట్టు వెల్లడించారు. దేశ వ్యాపారాలను విస్తరింప చేయడానికి సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలన్నారు. అది హెచ్1బీ వీసాతో సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు.
అందుకే ఈ అంశంపై తాను రెండు వాదనలనూ సమర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు హెచ్1బీ వీసా ఉపయోగపడుతుందని ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులు పేర్కొనగా కొందరు రిపబ్లికన్‌లు దీన్ని వ్యతిరేకించారు.
మస్క్ కొనుగోలు చేస్తే నాకు ఓకే
చైనా సంస్థ బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్ యాప్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అలాగే ఒరాకిల్ సీటీవో లారీ ఎల్లిసన్ వంటి టెక్ నిపుణులు ఎవరు కొనుగోలు చేసినా మద్దతిస్తానని పేర్కొన్నారు.
అయితే ఎవరు కొనుగోలు చేసిన అందులో సగం భాగస్వామ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎల్లిసన్ స్పందిస్తూ దీన్ని గొప్ప ఒప్పందంగా అభివర్ణించారు. మస్క్ మాత్రం దీనిపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు.
ట్రంప్ తాజా వ్యాఖ్యలపై టిక్‌టాక్ యాజమా న్యం స్పందించలేదు. అంతకుముందు మస్క్ వంటి దిగ్గజాలకు టిక్‌టాక్‌ను అమ్ముతున్నారంటూ వచ్చిన వార్తలను సంస్థ ఖండించింది.
భారత్‌కు టిక్‌టాక్ పునరాగమనం?
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థ నుంచి టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన దిగ్గజ వ్యా పార వేత్తలు కొనుగోలు చేయొచ్చనే ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టిక్‌టాక్ తిరిగి భారత్‌లో కూడా అడుగుపెట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం సంస్థ చేతులు మారినంత మాత్రాన టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం తిరిగి దేశంలోకి అనుమతిస్తుందని కచ్చితంగా చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం
అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్యూజన్ సిబ్బందికి లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్యూజన్ ప్రోగామ్‌లను నిర్వీర్యం చేస్తూ తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఆందోళనలో భారతీయులు
వసలదారుల పిల్లలకు జన్మతః లభి ంచే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై హెచ్1బీ, ఎల్1 వీసాలపై అమెరికా వెళ్లిన భారతీయు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తాజా ఆదేశాల ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ అయి తేనే వారికి పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అక్కడ పిల్లలకు జన్మనిచ్చినంత మాత్రాన వారికి పౌరసత్వం రాదు.
అమెరికాకు వలస వెళ్లిన దంపతులకు పుట్టిన పిల్లలు 21ఏళ్ల వయ సు వచ్చిన తర్వాత తప్పనిసరిగా దేశాన్ని వీడాల్సి ఉంటుంది. భారతీయులు తమ అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అంటూ ఓ ఇండియన్ అమెరిన్ తన అసహనాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
న్యాయపోరాటానికి సిద్ధమైన రాష్ట్రాలు
అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వలసదారులకు పుట్టిన పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే వారి పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని న్యాయ స్థానాల్లో సవాల్ చేశాయి. 22 రాష్ట్రాలు కలిసి రెండు వేర్వేరు వ్యాఖ్యలు దాఖలు చేశాయి. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పేర్కొన్నారు.