calender_icon.png 16 October, 2024 | 7:52 PM

స్పోర్ట్స్ కోటాలో 30 మందికే టీచర్ కొలువులు!

16-10-2024 02:31:50 AM

సరైన సర్టిఫికెట్లు లేక ఆగినవారు 363 మంది

పునఃపరిశీలనకు స్పోర్ట్స్ అథారిటీకి పంపనున్న అధికారులు

కొత్త టీచర్లలో అత్యధికంగా బీసీలు 54.70 శాతం ఎంపిక

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): డీఎస్సీ-2024 ద్వారా నియా మకపత్రాలు అందుకున్న 10,006 మందిలో స్పోర్ట్స్ కోటా కింద కేవలం 30 మందే ఎంపికయ్యారు. మొత్తం పోస్టుల్లో బీసీ కులాల అభ్యర్థులే అత్యధిక పోస్టులు సాధించారు. 54.70 శాతం పోస్టులు వారికి దక్కాయి. ఓసీలు 5.5 శాతం మంది, ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాలో 0.2 శాతం మంది ఎంపికయ్యారు.

ఎస్టీ అభ్యర్థులు 10.3 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 7 శాతం మంది, స్పోర్ట్స్ కోటాలో 0.3 శాతం మంది ఉన్నారు. అయితే స్పోర్ట్ కోటాలో 393 మందికి 30 మంది మాత్రమే ఎంపికైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 393 మంది అభ్యర్థులకు సంబంధించిన స్పోర్ట్స్ ధ్రువపత్రాలను స్పోర్ట్స్ అథారిటీకి అధికారులు పంపించారు.

అయితే అందులో కేవలం 30 మంది మాత్రమే అర్హులని తేలగా, వారిని పోస్టింగ్స్ ఇచ్చా రు. దీంతో స్పోర్ట్స్ కోటా ఎంపికలో ఎంపికైన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురికి స్పోర్ట్స్‌కు సంబంధించి సరైనా ధ్రువపత్రాలు లేకున్నా వారికి ఉద్యోగాలిచ్చారని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే కొంత మంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్లను మరోసారి స్పోర్ట్స్ అథారిటీకి పంపించనున్నారు. విచారణలో ఎవరైనా ఫేక్ అని తేలితే వారి ఉద్యోగం పోతుందని అధికారులంటున్నారు. ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.