12-02-2025 12:00:00 AM
స్వధర్మః స్వర్గాయ ఆనన్త్యాయ చ
తస్యాతిక్రమే లోకః సంకరాదుచ్ఛిద్యేత॥
కౌటిలీయం: (1
“నాయకుడు స్వధర్మాన్ని అనుసరిస్తూ, అనుచరులను స్వధర్మాన్ని విడవకుండా ఉండేట్లుగా చూడాలి. స్వధర్మాన్ని ఆచరించేవారు ఇహపర లోకాలలో సంతోషంగా ఉంటారు” అంటాడు చాణక్య. కర్తవ్య నిర్వహణలో బాహ్యమైన ఏ ప్రలోభాలకూ, భయాలకూ లొంగకుండా, పూర్వ నిశ్చి తాభిప్రాయాలకు అతీతంగా చేయదగిన కర్మలను ఆదరిస్తూ ఆచరించడాన్నే స్వధర్మం అంటారు. నిజమైన నాయకునిగా నిలవాలంటే తాత్త్వికమైన అవ గాహనతో పాటు విలువలతో కూడిన జీవన విధా నం, ప్రజలపట్ల శ్రద్ధ, దార్శనికత, నిర్వహణా నైపు ణ్యం సంతరించుకోవాలి.
ప్రతి సంస్థకూ నైతిక విలువలతో కూడిన ఆచరణీయ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. వాటినే సంస్థ తాలూకు సంస్కృతి అంటాం. ఈ మార్గదర్శనంలోనే పరస్పర ఆధారితంగా, అన్ని విభాగాలూ తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తాయి. వ్యాపారంలో విశ్వసనీయతను, నాణ్యతను పెంచ డం, మారుమూల వినియోగదారుని వరకూ విస్తరించడమే సంస్థ లక్ష్యం.
లాభాలను ఆర్జించడం ఒక్క టే కాదు, లాభాలు సహ-ఉత్పత్తులుగా, స్వయంచాలకంగా లభించేవే. సంస్థలో సమర్థత, నిబద్ధత కలిగిన నాయకుడు తాను స్వధర్మాన్ని పాటిస్తూ, అనుచరులూ అనుసరించేందుకు ప్రేరణనిస్తాడు. అటువంటి నాయకుడు శీలవంతుడై, స్వఛ్ఛమైన నైతిక వర్తనను జీవన విధానంగా కలిగి ఉంటాడు. ధైర్యం, దృఢదీక్షతో స్వధర్మాన్ని ఆచరించే వారి అడుగుజాడలలో అనుచరులూ నడుస్తారు.
మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిం చేందుకు తగిన సన్నద్ధతను నాయకుడు కలిగి ఉండాలి. అతని వృత్తి నిబద్ధత, ఉత్పాదక నాణ్యత, పారదర్శకతలు సంస్థపట్ల ప్రజలలో విశ్వసనీయతను పెంచుతాయి. లక్ష్య సాధనలో స్పష్టత, అనుచ రులపట్ల సహానుభూతి కలిగిన నాయకుడే ఉత్తము డు.
అనుచరులను, వినియోగదారులను ఆకర్షించగల వాక్‌నైపుణ్యం, ఇతరులను ఒప్పించే సామర్థ్యం, సంబంధిత రంగంలో విజ్ఞానం, నైపుణ్యం వంటివి నాయకుని దక్షతను వెల్లడిస్తాయి. సంస్థ స్థాయినీ పెంచుతామి. అలాంటి నాయకుడిని అనుచరులు, ప్రత్యర్థులూ గౌరవిస్తారు.
ఆత్మగౌరవం తప్పనిసరి
నిష్ఠతో స్వధర్మాన్ని అనుసరించడానికి నాయకునిలో ఆత్మగౌరవం ప్రస్పుటమవ్వాలి. సంస్థ ఉత్ప త్తుల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆత్మవిశ్వాసంతో కూడిన భావవ్యక్తీకరణ ఆత్మగౌరవానికి వన్నెనిస్తుంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో వినియోగదారులను ఎక్కువ కాలం ఆకర్షించడం ఎవరి కీ సాధ్యపడదు కాబట్టి, ఏ నాణ్యతనైతే వాగ్దానం చేస్తామో, దానితో ఒప్పుకున్న ధరకు, ఉత్పత్తులను సకాలంలో వినియోగదారునికి అందించగలగాలి.
అప్పుడే అమ్మకాలపట్ల ఆందోళన ఉండదు. ఉత్పత్తి వ్యయం, అమ్మకం విలువలపై స్పష్టత ఉండాలి. అప్పుడు నాయకునికి ‘నువు గెలువు, నన్ను గెలవనివ్వు’ ప్రాతిపదికన ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, అమ్మకాలను పెంచుకునేందుకై వినియోగదారుని నిబంధనలన్నింటికీ తలొగ్గితే భవిత అంధకారమవుతుంది. అలాగని నిరంకుశంగా వ్యవహరిస్తే అనామకునిగా మిగిలిపోతాడు. కాబట్టి, ఎక్కడ పెరగాలో, ఎక్కడ తగ్గాలో స్పష్టమైన అవగాహనతో వ్యవహారాన్ని నడపాలి. అలాంటి నాయకుడు ఉత్తమ ఫలితాలను ఆవిష్కరిస్తాడు.
సంస్థకు సంబంధించిన ప్రతి ఉద్యోగీ నిబద్ధత, నైతిక విలువలతో పనిచేస్తే అదే సంస్థ స్వధర్మ నిర్వహణ అవుతుంది. నాయకుని మార్గదర్శన, కఠిన పరీక్షా సమయాలలోనూ తక్షణ నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక, చట్టపరిధిలో న్యాయానికి కట్టుబడడం, కర్తవ్యాన్ని ఉపాసనగా భావించి సంస్థనుంచి పొంది న దానికన్నా సంస్థకు అధికంగా ఇవ్వగలగడం, వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించే మానసిక సన్నద్ధతను కలిగి ఉండడం..
వంటి వాటివల్ల నాయకుని పరిణతి, కార్యాచరణ దక్షత ఉన్నతిని పొందుతాయి. అతని స్థాయీ పెరుగుతుంది. అనుచరులు, వినియోగదారులతో సంబంధాలను పటిష్ట పరుచుకు నే నాయకుడు విపత్కర పరిస్థితులలోనూ ఉత్తమ ఫలితాలను సాధిస్తాడు. అయితే, ఆ సంబంధాలు వృత్తి పరమైనవిగానే కొనసాగాలే కాని వ్యక్తిగతంగా మారకూడదు.
భారతీయ వ్యాపార దిగ్గజ సంస్థ ఒకటి ఒకసారి తన ప్రాజెక్ట్ అనుమతులను పొందడానికై రాజకీ య నాయకులకు లంచాన్ని ఇచ్చేందుకు నిరాకరించింది. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ ఆమోదం పొందలేదు. అయినా, ఆ సంస్థ ఈనాటికీ ఉత్తమ విలువలతో అంతర్జాతీయంగా గుర్తింపును కలిగి ఉంది.
అందువల్ల స్వధర్మాన్ని ఆదరించే సంస్థ స్వల్పకాలిక ప్రయోజనాలకై దీర్ఘకాలిక ప్రయోజనాలను పణం గా పెట్టదు. విలువలను వదులుకొని నిజాయితీని అంగడి సరకుగా మార్చేందుకు సమ్మతించదు. నాయకుడు ఎప్పటికప్పుడు తన వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టుకుంటేనే అనుచరులూ ఆ మార్గంలో నడుస్తారు. ఏ వ్యక్తి అయితే తన నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు పదను పెట్టుకోడో ఆ వ్యక్తి జీవితంలో సమున్నత స్థాయికి చేరలేడు. చదవగలిగినా, చదవని వ్యక్తి నిరక్షరాస్యుని కన్నా ఉన్నతుడు కాడు.
పాలకుర్తి రామమూర్తి