తెలంగాణ రాష్ట్రంలో 2024లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రకాల హామీలతో గెలిచారు. అందులో రైతులకు ‘రైతు భరోసా’ కింద రూ.15 వేలు ఇచ్చే హామీ ఒకటి. ఇప్పుడు ఈ పథకం అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీనిని ‘ఎన్ని ఎకరాల రైతులకు ఇవ్వాలి?’ అనేది ప్రధానమైన ప్రశ్నగా మారింది. గత ప్రభుత్వం రైతులకు ‘రైతుబంధు’ పేరిట అడ్డు అదుపు లేకుండా, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసింది. ఎక్కువ మొత్తంలో భూమి ఉంటే చాలు అనే నినాదంతో ఇచ్చుకుంటూ పోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకూడదు. సరైనా మార్గదర్శకాలు రూపొందించి అర్హులకు మాత్రమే అందజేయాలి.
కేవలం 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే అందే విధంగా చూడాలి. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయంగా డబ్బులు అవసరమవుతాయి. అందులోనూ వారికి వున్నవి మంచి భూములు అనీ చెప్పలేం. తెలంగాణలో రైతులు ఎక్కువగా వర్షాధార పంటలపైనే ఆధారపడతారు. బావులు, చెరువులపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు బావులు లేవు, చెరువులు కూడా సరిగ్గా లేవు. బోర్లు, వర్షాలపైనే పూర్తిస్థాయిలో ఆధారపడాల్సి వస్తున్నది. కాబట్టి, ఎక్కువ మొత్తంలో కేవలం 5 ఎకరాల లోపు వారికి ఇస్తే సరిపోతుంది.
అలాగే, కౌలు రైతులకూ ‘రైతు భరోసా’ ఇస్తామని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించిన సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉందా? రాష్ట్రంలో భూమి లేనివాళ్ళు చాలామంది కౌలు విధానంపైనే ఆధారపడుతున్నారు. ఆత్మహత్యల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా వీరే ఉంటారు. అధిక కౌలుతో కష్టాలు పడుతూ పంట సరిగా రాక వీరి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లకు కనీసం పది ఎకరాల వరకు సాగు చేసేవారికి ఆర్థిక సాయం అందించాలి. భూమిని కౌలుకు ఇచ్చిన పట్టేదారు ‘రైతు భరోసా’ పొందరాదనే నిబంధన తేవాలి. కౌలు రైతులకు, నిజమైన చిన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే నిజమైన కౌలు రైతులకు, చిన్న పట్టేదార్‌లకు న్యాయం చేసినట్టు అవుతుంది.
ఈ మేరకు ముందస్తు సమాచారం తీసుకొని, రాష్ట్రంలోని పేద రైతులకు, కౌలుదారులకు న్యాయం చేయాలి. అక్రమంగా రైతు భరోసా సాయం పొందుతున్న వారికి నిలుపుదల చేయాలి. తద్వార ప్రజాధనం వృధా కాకుండా చూడాలి. అదే విధంగా, కౌలు రైతులకు సబ్సిడీలు అందించాలి. చిన్న, సన్నకారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి అభివృద్ధికి ప్రభుత్వం పాటు పడాలి. దీనికిగాను ఒక పటిష్ఠమైన వ్యవసాయ విధానం అమలులోకి తేవాలి. ఈ రకంగా ‘రైతే రాజు’ అన్న నినాదాన్ని నిజం చేయాలని కోరుతున్నాం.
కిరణ్ ఫిషర్
సెల్: 9133661793