రేషన్, ఆరోగ్య, సంక్షేమ పథకాలకు ఒకే డిజిటల్ కార్డ్
- ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు
- ఇతర రాష్ట్రాల్లో అమల్లోని విధానాలపై అధ్యయనం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రతి కుటుంబానికి.. ఫ్యామిలి డిజిటల్ కార్డు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తున్నది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటిని ఒకే కార్డు ద్వారా అందించాలని భావిస్తోంది. ఈ అంశంపై వైద్యారోగ్య, పౌరసరఫరాలశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని, వాటితో కలుగుతున్న ప్రయోజ నాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలి డిజిటల్ కార్డులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగ పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆయా కుటుంబ సభ్యులు తమ కుటుంబాల్లో సభ్యుల కలయిక, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్డు ను అప్‌డేట్ చేసుకు నేలా అవకాశం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచింంచారు.
ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్‌కు జిల్లాలవారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో రాష్ర్ట మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.