- ఈ నెల 31 వరకే దీర్ఘకాలిక నల్లా, సీవరేజీ బిల్లులపై వడ్డీ రాయితీ
- వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా నల్లా, సీవరేజీ బిల్లులు చెల్లించని వినియోగదారులకు జలమండలి ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్‌మెంట్) అవకాశాన్ని కల్పించింది. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, అధికారుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఓటీఎస్ అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఇప్పటికే 20 రోజులకు పైగా గడిచిపోవడంతో జలమండలి వినియోగదారులను మరోసారి అప్రమత్తం చేసింది. త్వరగా పెండింగ్ బిల్లులను చెల్లించి వినియోగదారులు ఆలస్య రుసుం, వడ్డీలపై రాయితీలు పొందాలని విజ్ఞప్తి చేసింది. అందుబాటులో ఉన్న జలమండలి కేంద్రాల్లో చెల్లింపులు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేసేందుకు అవకాశం కల్పించింది.
7 లక్షల మందికి లబ్ధి
జలమండలిలో మొత్తం 13.50 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, దాదాపు రూ.1,706 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఓటీఎస్ ద్వారా దాదాపు రూ. 1,189 కోట్లు బకాయిలు మాఫీ అవుతాయి. ఓటీఎస్ స్కీం ద్వారా దాదాపు 7 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. అయితే, నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారుల స్థాయిని బట్టి జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి నగదు పరిధిని నిర్ణయించారు.
మేనేజర్ స్థాయిలో రూ.2 వేలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10 వేలలోపు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1 లక్ష వరకు, ఛీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకు మించి బిల్లుల వరకు రాయితీ చేసే అధికారాన్ని కల్పించారు.
వినియోగదారుల బిల్లులు ఎంత ఉన్నాయి, ఎంత రాయితీ వస్తుంది, చెల్లించాల్సిన మొత్తం వివరాలను ఇప్పటికే ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కల్పించారు. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.
నిబంధనలు
ఈ నెల 31 వరకే ఓటీఎస్ అమలులో ఉంటుంది. గతంలో ఓటీఎస్‌ను వినియోగింకోని వారికే అసలు బిల్లు మొత్తాన్ని చెల్లిస్తే ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. గతంలో ఓటీఎస్ ద్వారా ప్రయోజనం పొందిన వారికి ఈ సారి 50 శాతం వడ్డీ రాయితీ అవుతుంది.
ఓటీఎస్ పొందాలనుకునే వినియోగదారులు వచ్చే 24 నెలల పాటు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాలి. విఫలమైతే వారు పొందిన ప్రయోజనం రద్దవుతుంది. నల్లా కనెక్షన్ డిస్‌కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
బిల్లులు ఇలా చెల్లించొచ్చు
* జలమండలి కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్ల వద్దకు నేరుగా వెళ్లి బిల్లులు చెల్లించొచ్చు.
* ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ యాప్‌లను ఉపయోగించి చెల్లించొచ్చు.
* ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్, బీపీపీఎస్ ద్వారా బిల్లులు కట్టొచ్చు.
* జలమండలి అధికారిక వెబ్‌సైట్ www.hyderabadwater.gov.in? <http://www.hyderabadwater.gov.in?>లో లాగిన్ అయి చెల్లించొచ్చు.
* లైన్‌మెన్లు వినియోగదారుల గృహాలను సందర్శించినపుడు వారి దగ్గర ఉండే ఈపీఓఎస్ యంత్రం, మీసేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా చెల్లింపులు చేపట్టొచ్చు.
* https://erp.hyderabadwater.gov.in/ HmwssbOnlineNew// HmwssbOTSDetails లింకును క్లిక్ చేయడం ద్వారా చెల్లించొచ్చు.
* జలమండలి అందించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కట్టొచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
ఓటీఎస్‌ను వినియోగదా రులు సద్విని యో గం చేసుకోవాలి. బిల్లులపై అసలు మొత్తం చెల్లిస్తే ఆలస్య రుసుం, వడ్డీపై రాయితీని పొందొచ్చు. ఈ నెల 31 వరకే ఈ అవకాశం ఉంది. బిల్లులు చెల్లించి జలమండలికి సహకరించాలి.
అశోక్‌రెడ్డి, జలమండలి ఎండీ