- ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని శాశ్వత నివాసాలను కూల్చివేయం
- వీటిపై ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం వెయిట్ చేస్తాం
- సందేహాలుంటే హైడ్రా కార్యాలయంలో సంప్రదించవచ్చు
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్‌౮ (విజయక్రాంతి): చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో చేపట్టిన కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి, నివాసాలు ఉంటున్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చియబోమని హామీఇచ్చారు. ఈ పరిధిలో కొత్తగా చేపడుతున్న నిర్మాణాలతోపాటు భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ఆక్రమణలకు పాల్పడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు ఉంటాయని వెల్లడించారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల విషయంలో.. ముఖ్యంగా మూసీ నది శాశ్వత ఆక్రమణల విషయంలోనూ చాలాకాలం నుంచి ఉన్న నివాసాలకు సంబంధించి ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం వెయిట్ చేస్తామని పేర్కొన్నారు. ఏదైనా సరస్సు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉండే ఇల్లు, ప్లాట్, స్థలాలు, భూములను కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే హెచ్‌ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్‌లో పరిశీలన చేసుకోవాలని లేదంటే హైడ్రా కార్యాలయంలో సంప్రదించొచ్చని కోరారు. ఆదివారం కూల్చివేసిన నిర్మాణాల్లో చెరువును ఆక్రమించిన వ్యక్తి చేపడుతున్న నిర్మాణాలలో కార్మికులుగా పనిచేసే వారి తాత్కాలిక వసతి నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు. అంతే తప్పా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివాసం ఉండే శాశ్వత నివాసాలను తొలగించలేదని స్పష్టంచేశారు.