calender_icon.png 27 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

52 లక్షల్లో 10 లక్షల మందికే భరోసా

27-01-2025 12:41:09 AM

* మిగతా లబ్ధిదారుల సంగతేంటి?

* మాజీ మంత్రి హరీశ్‌రావు 

గజ్వేల్, జనవరి 26: రాష్ట్రంలో 52 లక్షల మంది ఉపాధిహామీ కూలీలుంటే కేవలం 10 లక్షల మందికే ఆత్మీయ భరోసా ఇవ్వడమెంటని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో రైతు రుణమాఫీకి సీఎం ఇచ్చిన చెక్కు ఇంకా విత్‌డ్రా కాలేదని, అలాంటప్పుడు సీఎంగా రేవంత్‌రెడ్డికి అర్హత ఉండదన్నారు.

ఆదివారం గజ్వేల్‌లో గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గ అభినందన సభలో ఆయన ప్రసంగించారు. ఆయా పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రజాపాలనలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పక్కనపెట్టి, ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అర్జీలు పెట్టుకోవాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జనవరి 26న  పథకాలను వందశాతం అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి మాటతప్పారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక్క పిల్లరే కుంగిందని, ఎల్‌అండ్‌టీ సంస్థ దాన్ని సరిచేయొచ్చని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 69 లక్షల మందికి గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వగా, ఈ పథకంలో లబ్ధిదారులను తగ్గిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి 70 లక్షల మందికి ఇస్తున్నారని, ఎందుకు తగ్గించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.

కాంగ్రెస్ 400 రోజుల పాలనలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ హయాంలో గజ్వేల్ మున్సిపాలిటీ పాలకవర్గాలకు స్వర్ణయుగంగా హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్, ప్రజల దయ వల్ల వందలకోట్ల అభివృద్ధిలో భాగస్వాములయ్యారని పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎర్రోళ్ల శ్రీనివాస్, పన్యాల భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.