calender_icon.png 24 October, 2024 | 11:02 AM

కలియుగానికి మాత్రమే!

12-07-2024 01:00:00 AM

ఎంవీ నరసింహారెడ్డి :

‘విష్ణు పురాణం’లో కలియుగ గొప్పతనం, ప్రత్యేకించి శూద్రులు, స్త్రీల విశిష్ఠతను గురించిన విశేషాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పూర్వకాలంలో ఒకసారి మునుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగి, అనేక ప్రశ్నలు ఉదయించాయి. ‘ఏ కాలంలో తక్కువ పుణ్యం చేసినా ఎక్కువ ఫలితం లభిస్తుంది? ఎవరు దానికి అర్హులు?’ ఈ రెండు ప్రశ్నలకు సమాధానం పొందడానికి మునులంతా కలిసి వేదవ్యాసుని వద్దకు వెళ్లారు. మునులు అక్కడికి చేరుకునేసరికి వేదవ్యాస మునీంద్రుడు గంగానదిలో స్నానం చేస్తూ ఉన్నాడు. అందువల్ల వారంతా నదీ తీరంలోనే చెట్ల కింద నిరీక్షిస్తూ కూర్చున్నారు. 

గంగానదిలో మునకలు వేస్తూ కాస్త బిగ్గరగా వ్యాసుడు ఇలా అన్నాడు

“కలియుగమే శ్రేష్ఠమైంది. శూద్రులే శ్రేష్ఠమైన వారు. ఓ శూద్రులారా! మీరే శ్రేష్ఠమైన వారు. మీరు ధన్యులై ఉన్నారు. స్త్రీలు సాధుశీలురై ఉన్నారు. వారుకూడా ధన్యులై ఉన్నారు. వారిని మించిన పుణ్యశీలురు లేరు”.

స్నానానంతరం వేదవ్యాసుడు నిత్యకర్మల నుండి నివృత్తుడై మునులను కూర్చోబెట్టి అడిగాడు. “మీ రాకకుగల కారణం చెప్పండి”. అప్పుడు మునులు అడిగారిలా, “దేవా! మా సందేహాలను తీర్చుకోవడానికి మీ వద్దకు వచ్చాం. కానీ, మీరు స్నానం చేస్తున్నప్పుడు అన్న మాటలు మేం విన్నాం. వాటికి అర్థం చెప్పండి. శూద్రులు ఎలా శ్రేష్ఠులో తెలియచేయండి.” 

వేదవ్యాస మునీంద్రుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు 

“మునులారా! సత్యయుగంలో బ్రహ్మచర్యం ఆచరిస్తూ పది సంవత్సరాలు జపతపం చేయడం వల్ల కలిగే ఫలితం త్రేతా యుగంలో ఒక సంవత్సరంలోనే సిద్ధిస్తుంది. ఇది ద్వాపర యుగానికి వచ్చేసరికి ఒక మాసానికి కలుగుతుంది. కానీ, కలియుగంలో మాత్రం అంతటి ఫలం కేవలం ఒక దినం లేదా రాత్రిపూట నిష్ఠగా జపం చేసుకోవడం వల్ల మాత్రమే కలుగుతుంది. అందుకే, కలియుగం శ్రేష్ఠమైందని చెప్పాను. అంతేకాదు, సత్యయుగంలో ధ్యానం చేయడం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం వల్ల, ద్వాపర యుగంలో దేవతార్చన చేయడం వల్ల ఎంత పుణ్యఫలమైతే కలుగుతుందో అంత పుణ్యఫలమూ కలియుగంలో కేవలం శ్రీకృష్ణుడిని స్తుతించడం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. ఇలా కలియుగంలో చిన్నపాటి కృషి చేసినా గమ్యం చేరుకున్న వారవుతారు. 

ఇక, శూద్రులు శ్రేష్ఠులని చెప్పడానికీ సరైన కారణం ఉంది. వారి సేవా గుణమే వారిని పుణ్యలోకాలకు తీసుకెళ్తుంది. గొప్పవారనుకునే వారి దీక్షలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది అనర్థదాయకమవుతుంది. శూద్రులకు ఆ బెడద లేదు. స్త్రీలుకూడా తమ పతులపట్ల చూపించే భక్తి ప్రపత్తులు, ప్రేమాదరాలు వారిని పుణ్యలోకాలకు తీసుకెళతాయి” అన్నాడు వేదవ్యాసుడు. తమ సందేహాలు తీరినందుకు మునులు సంతోషించారు.

పరమాత్మ స్వయంగా ప్రకృతి ప్రసవించటానికి ప్రేరేపించి, అనేక రూపాల లోకి దానిని మారుస్తుంటాడు. ప్రకృతి, దాని వికారాలనే ‘క్షేత్రం’ అంటాం. ఈ క్షేత్రం గురించి పరమాత్మకు తెలుసు. కనుకనే, ఆయనను ‘క్షేత్రజ్ఞుడు’ అంటా రు. ‘క్షేత్రజ్ఞుడు’ ప్రకృతి జనితపురం (శరీరం)లో శయనిస్తాడు. అందుకే, అతనిని ‘పురుషుడు’ అన్నారు.