21-02-2025 12:59:50 AM
* పోటాపోటీ ప్రచారం
* క్షేత్రస్థాయిలో టీంలను దించేందుకు సిద్ధం
* దూర ప్రాంత ఓటర్లను రప్పించేందుకు ప్రణాళికలు
కరీంనగర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): గతంలో ఎప్పుడు లేని విధంగా కరీంనగర్-మెదక్--- పట్టభ ద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటా పోటీ ప్రచారం కొనసాగుతుంది. ఎన్నికలకు మరో వారం రోజులే గడువు ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక టీంలను దించి ప్రతి ఓటరును కలిసేందుకు అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకుంటు న్నారు. ఈసారి బీఆర్‌ఎస్ తన అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుని విస్తృత ప్రచారం చేస్తున్నాయి.
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో 56 మంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, ట్రస్మా మద్దతు బరిలో దిగిన యాదగిరి శేఖర్ రావు, ఏఐఎఫ్ బి నుండి పోటీ చేస్తున్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ముస్త్యాక్ అలీల మధ్యే ఉంది.
ఉపాధ్యాయ నియోజకవర్గ బరిలో 15 మంది పోటీలో ఉండగా ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్య, పీఆర్టీయూ నుంచి బరిలో దిగిన వంగ మహేందర్ రెడ్డిల మధ్య నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఆ పార్టీ ఎంపీలు, రాష్ర్ట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
దూర ప్రాంతవాసులను తీసుకువచ్చేది ఎలా..?
పట్టభద్రుల ఓటర్లలో సుమారు 40 వేల మంది వరకు హైదరాబాద్, బెంగుళూరులాంటి చోట్ల సాప్ట్ వేర్ , ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిని గుర్తించి పోలింగ్ తేదీ రోజు పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం ఎలా అన్నదానిపై అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు. పోలింగ్ రోజు గురువారం కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సెలవు ఉండదు. వారికి శని, ఆదివారాలు మాత్రమే సెలవు ఉంటుంది. వీరిని తమవైపు తిప్పుకుని పోలింగ్ రోజు ఇక్కడికి తీసుకురా వడంపై తను వద్ద ఉన్న అనుచరులతో ప్రయత్నాలు ప్రారంభించారు.
హైదరాబాద్, బెంగుళూరులాంటి చోట్ల కుటుంబంలో ఇద్దరు, ఆపై ఓటర్లు ఉంటే వాహనాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఒక్కరు, ఇద్దరుంటే ప్రయాణ ఖర్చులు అప్పగించి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ల ద్వారా తమకు ఓటేయాలని అభ్య ర్థిస్తున్న అభ్యర్ధులు పోలింగ్ తేదీ నాటికి ఇక్కడకు తీసుకువచ్చి తమకు అనుకూలంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు ఓటర్లు తమకు ఎంత ముట్టజెప్తారు దాన్నిబట్టే ఆలోచిస్తామని ఇప్పటికే అభ్యర్ధుల అనుచరులకు చెప్పినట్లు తెలిసింది.