calender_icon.png 25 December, 2024 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి సరఫరాపై ఆన్‌లైన్ మానిటరింగ్

25-12-2024 12:49:20 AM

  1. రిజర్వాయర్లు, ఎస్టీపీల వద్ద ఫ్లోమీటర్లు, కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం
  2. తాగునీటి సరఫరా, మురుగు శుద్ధిపై ఎప్పటికప్పుడు జలమండలి అప్‌డేట్స్
  3. క్షేత్రస్థాయి అధికారి నుంచి ఎండీ వరకు నేరుగా వివరాలు తెలుసుకునే అవకాశం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2౪ (విజయక్రాంతి): గ్రేటర్ సహా, ఓఆర్‌ఆర్ వరకు ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్న హైదరాబాద్ జలమండలి తన పరిధిలోని సర్వీస్ రిజర్వాయర్లను పూర్తిస్థాయి లో ఆన్‌లైన్ మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే పలు సర్వీస్ రిజర్వాయర్లను ఆన్‌లైన్ చేసిన జలమండలి అధికారులు మరిన్ని సర్వీస్ రిజర్వాయర్లు, ఎస్టీపీల (మురుగు శుద్ధి కేంద్రాల)ను ఆన్‌లైన్ పర్యవేక్షణలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఆయా రిజర్వాయర్లకు వివిధ జలాశయాల నుంచి వచ్చిన నీరెంత, వినియోగదారులకు చేసిన సరఫరా ఎంత అనే వివరాలను ఖచ్చితంగా లెక్కించే చర్యలను తీసుకుంటున్నారు.

అందుకోసం వివిధ జలాశయాల నుంచి నగరంలోని జలమండలి డబ్ల్యూటీపీలు, రిజర్వాయర్లకు వచ్చే ఆఫ్‌టేక్‌ల వద్ద, రిజర్వాయర్ల నుంచి ఓఅండ్‌ఎం డివిజన్లకు నీటి సరఫరా జరిగే ప్రధాన పైప్‌లైన్‌ల వద్ద మరిన్ని ఫ్లో మీటర్లను ఏర్పాటు చేయబోతున్నారు.

రిజర్వా యర్లలోని నీటి నిల్వలు, డివిజన్లకు జరుగుతున్న నీటి సరఫరా వివరాలను, ఎస్టీపీల వద్ద జరుగుతున్న మురుగు శుద్ధి వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 

మెరుగైన సేవలకు..

గ్రేటర్, సహా ఓఆర్‌ఆర్ వరకు దాదాపు 13.5లక్షల మంది వినియోగదారులకు జలమండలి దాదాపు 590ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. అయినప్పటికీ కొన్నిచోట్ల తమకు నీళ్లు సరిగా రావడం లేదని వినియోగదారులు, తమ ప్రాంత ప్రజలకు నల్లా నీరు రావడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు జలమండలి అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి.

ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు, పారదర్శకంగా  నీటి సరఫరా, సేవలందించేందుకు జలమండలి సర్వీస్ రిజర్వాయర్ల వద్ద ఫ్లో మీటర్లు, కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 180కిపైగా ఫ్లో మీటర్లను ఏర్పాటు చేయగా, మరో 50-100ఫ్లో మీటర్లను ఏర్పాటు చేయనున్నారు.

వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఆయా సర్వీసు రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, వాటి పరిధిలోని వినియోగదారులకు ఎంత నీటిని అందించారనే లెక్కలను క్షేత్రస్థాయి అధికారి నుంచి ఎండీ వరకు నేరుగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఈ వివరాలు నమోదు చేస్తుండగా, భవిష్యత్‌లో మొబైల్ యాప్ లాంటి ఆన్లున్ అప్లికేషన్‌ను కూడా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. 

చిటికెలో మురుగు శుద్ధి వివరాలు

జలమండలి పరిధిలోని ఎస్టీపీలను ఆన్‌లైన్ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 20 ఎస్టీపీల ద్వారా ప్రస్తుతం 714 ఎంఎల్డీల మురుగు శుద్ధి అవుతోంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన మరో 11ఎస్టీపీల ద్వారా దాదాపు 500 ఎంఎల్డీల మురుగు శుద్ధి అవుతోంది. ప్రతీ రోజు ఎస్టీపీలలో శుద్ధి అవుతున్న వివరాలను అధికారులకు డాష్‌బోర్డు ద్వారా సమాచారం అందుతోంది.

దాన్ని మరింత పారదర్శకంగా ఉండే లా ఎస్టీపీల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయ డం, ఆన్‌లైన్ చేయడంతో స్పష్టమైన వివరాలను అధికారులకు తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతీ పావుగంటకు ఒకసారి ఎస్టీపీల నుంచి ఎంత మురుగు శుద్ధి జరిగిందనే వివరాలను నేరుగా తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాలను మరింత వేగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా చేరవేసేలా చర్యలు తీసుకోబోతున్నారు.