10-04-2025 01:07:08 AM
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
కరీంనగర్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): విద్యుత్ ఎల్సీలు తీసుకొని పనిచేసే సమయంలో చాల మానవ తప్పిదాలు జరుగుతుంటాయి. ఒక ఫీడర్ బదులు మరో ఫీడర్ ఎంచుకోవడం, పంపిణీ వ్యవస్థను సరిగ్గా గుర్తుచేసుకోకపోవడం , సమాచార లోపం, తదితర కారణాల వలన ఉద్యోగులకు విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటన్నింటిని నివారించడానికి విద్యుత్ శాఖ నూతనంగా ఆన్ లైన్ ఎల్సీ( లైన్ క్లియర్ ) యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
కరీంనగర్ ఎన్ పి డి సి ఎల్ పరిధిలో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా మానవ తప్పిదాలను పూర్తిగా నివారించవచ్చు. అనవసరమైన ఎల్సీ లు తగ్గించడంతోపాటు ఎల్సీల సమయాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎల్సీలు తీసుకున్న సమాచారం పై అధికారులకు వెనువెంటనే తెలుస్తుంది. సంబంధిత ఏ .ఈ గారి అనుమతి లేకుండా తీసుకునే ఎల్సీ లను నివారించవచ్చు.
ఎల్సీ యాప్ అమలు చేసే విధానం...
మొదట ఎల్సీ తీసుకోవాలనుకున్న లైన్ మెన్ ఎల్సీ( లైన్ క్లియర్ ) యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్ లో ఎల్సీ కావాలని సంబంధిత ఏ.ఈ కి విన్నవించుకుంటాడు. ఏ.ఈ లైన్ మెన్ విన్నపాన్ని పరిశీలించి ఆ ఫీడర్ లో ఎల్సీ ఇవ్వచ్చా లేదా అని, అత్యవసర అవసరాలు ఏమైనా ఉన్నాయా లేదా అని మరే ఇతర షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు . ఏ.ఈ ఎల్సీ ఇవ్వచ్చు లేదా నిరాకరించవచ్చు .
అలా ఏ.ఈ ఎల్సీ కి అనుమతి ఇవ్వగానే సంబంధిత లైన్ మెన్ కి వెళ్తుంది . అలాగే సబ్ స్టేషన్ ఆపరేటర్ కు ఏ ఫీడర్ ఇవ్వాలో యాప్ ద్వారా వెళ్తుంది. అలా సబ్ స్టేషన్ ఆపరేటర్ కు ఎల్సీ ఇవ్వాల్సిన సమయంలో ఏమరపాటుగా చేసే పొరపాట్లను నివారించుటకై తగు సూచనలు, జాగ్రత్తలు యాప్ తెలియ పరుస్తుంది. హెల్మెట్ పెట్టుకోవాలని, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వెయ్యాలని, ఎబి స్విచ్ ఓపెన్ చేసారా లేదా అని యాప్ గుర్తు చేస్తుంది.
వీటన్నింటిని సబ్ స్టేషన్ ఆపరేటర్ చేసి ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే ఆ ఫోటో ను యాప్ ద్వారా లైన్ మెన్ చూసుకొని ఆ ఫొటోలో కన్పిస్తున్న ఫీడర్ , ఎబి స్విచ్ ఓపెన్ చేసారా లేదా అని ద్రువీకరించుకొని పనికి ఉపక్రమిస్తాడు. పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాప్ లో సూచించబడుతాయి. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా, ఈ ఫీడర్ కు వేరే ఫీడర్ తో అనుసంధానం ఉందా లేదా మరే ఇతర ఫీడర్ తో క్లియరెన్స్ తక్కువగా ఉందా అని యాప్ సూచనలు, జాగ్రత్తలు హెచ్చరిక చేసి గుర్తు చేస్తుంది.
లైన్ మెన్ ఎంత మంది సిబ్బంది చేత పని చేయిస్తున్నాడో వారి పేర్లు యాప్ లో పొందుపరచాలి అలాగే హెల్మెట్ పెట్టుకోవాలని, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వెయ్యాలని యాప్ అప్రమత్తం చేస్తుంది. లైన్ మెన్ పని పూర్తి కాగానే ఆ పనికి సంబంధిచిన ఫోటో, సిబ్బంది వచ్చారా లేదా అని యాప్ లో పొందుపరచి ఎల్సీ ని రిటర్న్ చేస్తారు.
ఇలా సబ్ స్టేషన్ ఆపరేటర్ కు యాప్ ద్వారా ఆదేశాలు ఎల్సీ ని రిటర్న్ చేయాలనీ వెళ్తాయి. అప్పుడు సబ్ స్టేషన్ ఆపరేటర్ ఎల్సీ రిటర్న్ చేసే క్రమంలో ఎర్త్ రాడ్ తీసారా, ఎబి స్విచ్ ఓపెన్ చేసారా లేదా యాప్ అడుగుతుంది. ఇలా ఎల్సీ పూర్తి అవుతుంది. రిటర్న్ చేసిన ఎల్సీ సమాచారం ఏ.ఈకి వెళ్తుంది.
ఎల్‌సీయాప్‌తో మానవ తప్పిదాలను నివారించవచ్చు
విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు, భద్రత ప్రమాణాలను పెంచడానికి ఈ ఎల్సీ యాప్ రూపొందించారు. ఈ ఎల్సీ( లైన్ క్లియర్ ) యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను నివారించవచ్చు.
కరీంనగర్ ఎస్‌ఈఎం రమేష్ బాబు