- అధికారులు, ఎన్యుమరేటర్లు కష్టపడుతున్నా ఆలస్యమవుతున్న సర్వే
- మొదలైన కులగణన పత్రాల ఆన్‌లైన్
- సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా ప్రారంభం
- 13రోజుల్లో 83శాతం సర్వే పూర్తి
- 17 జిల్లాల్లో 90శాతానికిపై ఇళ్ల గణన
- ఈ నెలాఖరుకు పూర్తవడంపై అనుమానాలు
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పట్టణాల్లో నత్తనడకన సాగుతోంది. గ్రామాలు ఎక్కువగా ఉన్న కొన్ని జిల్లాల్లో ఇప్పటికే 100శాతం సర్వే పూర్తి కాగా.. హైదరాబాద్‌లో కేవలం 60.60 శాతం మాత్రమే ఇళ్ల గణన జరగడమే దీనికి నిదర్శనం.
అధికారులు, ఎన్యుమరేటర్లు కష్టపడుతున్నా కులగణన ముందుకుసాగని పరిస్థితి నెలకొంది. ఈ నెల 9వ తేదీన రెండో దశ సర్వే ప్రారంభం కాగా.. 19వ తేదీలోపు వివరాల నమోదును పూర్తి చేయాలని సర్కారు భావించింది. కానీ అది సాధ్యం కాలేదు. తొలి రెండు రోజుల పాటు సర్వే పత్రాలు నింపడంలో ఎన్యుమరేటర్లు ఇబ్బంది పడ్డారు.
అలాగే క్షేత్ర స్థాయిలో ప్రజలు కూడా ఎన్యుమరేటర్లకు సహకరించలేదు. దీనికి తోడు డేటా ఎంట్రీ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఆన్‌లైన్ ఆలస్యమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి కులగణన ప్రక్రియ పూర్తి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా పట్టణ ప్రాం తాల్లోనే సర్వే చాలా నెమ్మదిగా సాగుతోంది. గ్రామాల్లో మాత్రం కులగణన జెట్ స్పీడులో దూసుకుతోంది. గిరిజనులు ఎక్కువగా ఉన్న ములు గు జిల్లా సర్వేలో అగ్రస్థానంలో ఉంది.
నేటి నుంచి పూర్తిస్థాయిలో..
సర్వేలో భాగంగా సేకరించిన డేటా ఆన్‌లైన్ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. ప్రభుత్వం అనుకున్న తేదీకి ఆన్‌లైన్ కావాలంటే ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. డేటా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసే పనులు ఇప్పటికే కొంత పూర్తికావాల్సి ఉం ది. అయితే సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన సమస్యల వల్ల ఆపరేటర్లకు ట్రైనింగ్ ఆలస్యమైంది.
వాస్తవానికి 17వ తేదీన రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన 300 మాస్టర్ ట్రైనీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ మాస్టర్ ట్రైనర్లు జిల్లా స్థాయిలో ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాస్టర్ ట్రైనర్లు ట్రైనింగ్ ఇచ్చిన సమయంలో డేటా ఎంట్రీ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలను గుర్తించారు. దీంతో 18,19వ తేదీల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించి 20,21 తేదీల్లో జిల్లాల్లో ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు.
అయితే 20వ తేదీన శిక్షణ ఇచ్చిన వారు గురువారం డేటా ఎంట్రీని మొదలు పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. దీంతో సర్వే పత్రాల ఆన్‌లైన్ స్పీడందుకోనుంది.
జనగాం, ములుగులో వంద శాతం..
జనగాం, ములుగు జిల్లాలలో గురువారం నాటికి వంద శాతం సర్వే పూర్తయింది. నల్గొండ జిల్లా 99.7 శాతం, కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నారాయణ్ పేట్, జయశంకర్ భూపాల పల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం చెప్పింది.
అలాగే హన్మకొండలో 75.7 శాతం, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 71.2 శాతం జరగ్గా.. మిగతా జిల్లాల్లో 80 శాతానికి పైగా సర్వే జరిగినట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యల్పంగా 60.60 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వివరించింది.
0.1శాతం మాత్రమే డిజిటలైజ్
రాష్ట్రంలో మొత్తం ఇళ్లు 1.16 కోట్లు ఉండగా.. గురువారం నాటికి 96,41,121 ఇళ్ల సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో గురువారం 7,177 సర్వే పత్రాలు డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించింది. మొత్తం కుటుంబాల సంఖ్యలో డిజిటలైజ్ చేసింది 0.1శాతం మాత్రమే కావడం గమనార్హం.
వాస్తవానికి సర్వే, ఆన్‌లైన్ రెండింటిని ఏకకాలంలో నిర్వ హిస్తే.. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం భావంచింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అటు సర్వే, ఇటు ఆన్‌లైన్ ఆలస్యమైంది.
తొలుత 20వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఆన్‌లైన్ ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వం అనుకున్నది. ఆ విధంగా ఇరవై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చింది. అయితే అనుకున్న తేదీకి ఆన్‌లైన్ పూర్తి చేసేందుకు మరికొంత మంది ఆపరేటర్లను నియమించుకునే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.