calender_icon.png 19 April, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న రాజాసింగ్ ఎపిసోడ్

19-04-2025 01:20:24 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన కీలక మీటింగ్‌కు దూరం

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): బీజేపీలో రాజాసింగ్ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. పార్టీలో అంతా సర్దుకుందని భావించినా, రాజాసింగ్ వైఖరి పార్టీ నేతలకు తలనొప్పిగా తయారైంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తం కోసం శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీలో ఏదో జరుగుతుందనే చర్చ మొదలైంది.

రాష్ట్రంలో పార్టీ ఎదుగుతున్న తరుణంలో సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని రోజుల కిందట రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పాత సామాన్ వెళ్లిపోవాల్సిందేనంటూ సీనియర్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిని బీజేపీ స్టేట్ కమిటీ నిర్ణయిస్తే వచ్చేది రబ్బర్ స్టాంపేనంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ వివాదంపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ పార్టీవర్గాలు తెలిపాయి.

చివరకు హనుమాన్‌జయంతి రోజున కేంద్రమంత్రి బండి సంజయ్, రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజాసింగ్ ఎపిసోడ్ మీడియా సృష్టిగా బండి సంజయ్ పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది..

ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్‌రావు గెలుపునకు రాజాసింగ్ కృషి చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్న తరుణంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటింగ్‌పై అవగాహన సమావేశానికి ఆయన దూరమవడంతో మళ్లీ ఎపిసోడ్ మొదటికొచ్చిందంటూ పార్టీలో చర్చ జరుగుతుంది.