సీఎం పేరు ప్రకటనలో మరింత ఆలస్యం!
క్యాబినెట్ కూర్పు తర్వాతే నిర్ణయం
ముఖ్యమంత్రి పదవికి షిండే రాజీనామా
న్యూఢిల్లీ, నవంబర్ 26: మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పేరు ప్రకటనపై ఎలాంటి వివాదం ఉండబోదని, ఈ విషయంలో కేంద్ర నాయకత్వం తొందరపడటం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తద్వారా దేవేంద్ర ఫడ్నవీస్‌నే మహా పీఠంపై కూర్చొబెట్టే అవకాశాలు ఉన్నాయని బీజేపీ పెద్ద హింట్ ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యేంత వరకు సీఎం పేరును ప్రకటించకూడదని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. భాగస్వామ్య పక్షాలలో ఎలాంటి బేధాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు బీజేపీ అధినా యకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఇందుకు సంబంధించిన రాష్ట్ర నేతల తో మంతనాలు జరుపుతోందని తెలిపారు.
షిండే రాజీనామా
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో పూర్తున నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే తన రాజీనామాను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని షిండేను గవర్నర్ కోరారు. కాగా, బుధవారం ఉదయం వరకు మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశముందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సాట్ పేర్కొన్నారు. క్యాబినెట్ కూర్పుపై ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో బీజేపీ పరిశీలక బృందం చర్చించిన తర్వాతే సీఎం పేరును ప్రకటించనున్నట్లు చెప్పారు.