14-02-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో రాచకొండ పోలీసులు మరోసారి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేపట్టే వారిపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
గత కొన్ని రోజులుగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా మీద పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండో రోజు కొనసాగిన స్పెషల్ డ్రైవ్ తో నమోదయిన కేసుల సంఖ్య 71 కి చేరుకుంది. ఎల్బీనగర్ జోన్‌లో 26 కేసులు, మల్కాజిగిరి జోన్‌లో 23 కేసులు, యాదాద్రి- భువనగిరి జోన్‌లో 10 కేసులు, మహేశ్వరం జోన్‌లో - 12 కేసులు ఇలా నాలుగు జోన్లలో మొత్తం 107 మంది నిందితుల మీద 71 కేసులు నమోదు చేయడంతో పాటు 44 ఇసుక డంపులలోని 58 లక్షల 72 వేల రూపాయల విలువైన 3762 టన్నుల ఇసుకను సీజ్ చేసి 9 లారీలు, 5 టిప్పర్లు, ఒక మినీ వ్యాన్ మరియు 8 ట్రాక్టర్లనుజ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు, మాట్లాడుతూ.. ఇసుక మాఫియాను అరికట్టడంలో రాచకొండ పోలీసులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై మరింత కఠినంగా వ్యవహరించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ముందు కూడా తమ దాడులు ఇలాగే కొనసాగుతాయని, నేరస్తులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.