15-12-2024 12:09:56 AM
తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్‌గా ఉద్యమాన్ని నడిపించిన కోదండరాంని ‘నేను తయారు చేసిన లక్షమందిలో ఒకడు’ అని కేసీఆర్ అగౌరపరిస్తే, కాంగ్రెస్ ఆయనకు సరైన గుర్తింపు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమానికే ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులు, తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరితే నన్నే ప్రశ్నిస్తారా’ అనే అహంకారంతో వారిపై కక్షగట్టి సంస్థ మనుగడకే ప్రమాదం తెచ్చిన కేసీఆర్ తీరును తెలంగాణ ఎన్నటికీ మర్చిపోదు. మొదటి తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రికూడా లేకుండా పాలించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వడంతోపాటు వారి సాధికారత కోసం కృషి చేస్తున్న ఘనత కాంగ్రెస్‌ది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడా ది పూర్తయింది. గడీల పాలన పోయి, గరీబోళ్ల పాలన వచ్చిందని ప్రజలు సంతోషపడుతుంటే, బీఆర్‌ఎస్ నేతలు మాత్రం బురుద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కానీ, ఏ ఒక్కరూ నిర్మాణాత్మక విమర్శ చేయడం లేదు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, కాంగ్రెస్ తప్పులు చేస్తోందని కబుర్లు చెప్తున్నారు.
‘తెలంగాణ బాపు’ అని ప్రచారం చేసుకున్న మాజీ ముఖ్య మంత్రి, ప్రతిపక్షనేత కేసీఆర్, అసెంబ్లీకి వచ్చి ‘గడీల పాలన నుంచి గరిబోళ్ల పాలన వరకు’ అన్నీ చర్చించాలని కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది. అయినా, అసెంబ్లీకి రాకుంటే, ‘బాపు ఒక ఫేకు’ అని, తెలంగాణ మీద కేసీఆర్‌కు ఉన్న ఏ మాత్రం సోయి లేదని తేలిపోతుంది.
ఉద్యమ పార్టీ అని గొప్పలు చెప్పుకునే బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైంది. సెంటిమెంట్ పేరుతో రెండుసార్లు అధికారం చేపట్టి, గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారు. రాష్ట్రాని కి గుండెకాయలాంటి సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమై పాలన సాగించడంతో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.
బీఆర్‌ఎస్ పెత్తందారు సర్కార్‌తో విసిగిపోయి అధికారం తీసేసినా కేసీఆర్‌లో, కేసీఆర్ కుటుంబసభ్యుల్లో అహంకారం మాత్రం తగ్గలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తిమ్మిని బమ్మిని చేసి కేసీఆర్ సీఎంగా అందలమెక్కి, నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ మూల సిద్ధాంతాలకు తూట్లు పొడిచారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా సబ్బండ వర్ణాలు ప్రాణాలకు తెగించి పోరాడారు. వారికి అధికారంలో ఎలాంటి భాగస్వామ్యం కల్పించకపోగా, వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా చేసిన పాలనను ప్రజలు ఎన్నటికీ మరవలేరు.
ఏడాదిలోనే ౫౪ వేల ఉద్యోగాలు
తెలంగాణ వస్తే మన రాష్ట్రంలోని ఉద్యోగాలు మన కే వస్తాయనే ఆశతో యువత పెద్దఎత్తున ఉద్యమించింది. ఉద్యోగాలపై గంపెడాశలు పెట్టుకున్న యువత కు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక కేవలం తన కుటుంబసభ్యులకే రాజకీ య ఉపాధి కల్పించుకున్నారు. ఇచ్చిన అరకొర ప్రభు త్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను కూడా పూర్తి చేయలేకపోయారు. నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టుల్లో కేసులు వేయించి ఉద్యోగాల భర్తీ ఆపించారు. పదో తరగతి మొదలు గ్రూప్ -1 పరీక్షల వరకు అన్నింటా జరిగిన అవకతవకలను ప్రజలు ఎన్నటికీ మరవలేరు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అవినీతిమయమైన టీజీపీఎస్సీపీ ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ పరీక్షలను విజయవంతం గా నిర్వహించాం. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో దాదాపు 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పిన విషయం బీఆర్‌ఎస్‌కు తెలి యదా? ఉద్యమంలో మరో నినాదమైన నీళ్లు అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ పాలనలో నీరు గార్చారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బదులు కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. ఇంజినీ ర్లను పక్కన పెట్టి తానే కాళేశ్వరం డిజైన్ రూపకర్తను అంటూ గర్వంగా చెప్పుకున్న కేసీఆర్ ప్రాజెక్టును గంగ లో ముంచారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను తానే కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పిన కేసీఆర్ ఎన్ని చోట్ల కూర్చున్నారో? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశా రో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరు.
2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఉండగా, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుతో ఉందనేది వాస్తవం కాదా..? బీఆర్‌ఎస్ చేసిన అప్పులతో ప్రస్తుతం ప్రతి నెల రూ.6,500 కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో రాష్ట్ర భవిష్యత్ తరాలకు శాపంగా మారిన విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. రూ.21 వేల కోట్లు మాఫీ చేయడంతో, రాష్ట్రంలో 25 లక్షలమంది రైతులు రుణమాఫీ సహాయం పొందారు. బీఆర్‌ఎస్ హయాంలో పంటబీమా లేకపోవడంతో రైతాంగం నష్టపోగా కాంగ్రె స్ ప్రభుత్వం 42 లక్షలకుపైగా రైతులకు బీమా కవరేజీ కోసం రూ.1,433.33 కోట్ల ప్రీమియం చెల్లించింది.
అకాలవర్షాలతో నష్టపోయిన 94 వేల మందికి పైగా రైతులకు రూ.95.38 కోట్ల పంట నష్టాన్ని చెల్లించి కాం గ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకుంది. సన్నాలు పండించిన వారికి రూ.500 బోనస్ చెల్లించింది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇవేం ప్రస్తావించకుండా నాడు అరకొరగా రుణమాఫీ చేసి, లక్షలాదిమంది రైతుల ఉసురు పోసుకున్న బీఆర్‌ఎస్ తీరును తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవలేరు.
సహజ సిద్ధమైన మాతృమూర్తి
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ విగ్రహం, ఆట, పాట, సంస్కృతి, సాహిత్యం... ఇలా అన్నింటా రాష్ట్ర అస్తిత్వాన్ని ధ్వంసం చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని బీఆర్‌ఎస్, ఆ పని చేసిన కాంగ్రెస్‌ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. బీఆర్‌ఎస్ కార్యాలయంలో రాచరికానికి దర్పణంగా కిరీటంతో, బతుక మ్మతో విగ్రహం ఉంటే, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విగ్రహంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడుతూ సహజసిద్ధమైన మాతృమూర్తిలా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదని విమర్శిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లు ప్రజల బతుకులతో ఎలా ఆడుకున్నారో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువరు.
తెలంగాణ ఉద్యమంలో ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గేయం సకల జనులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చింది. అలాంటి గేయాన్ని, అది రాసిన కవి అందెశ్రీని అవమానించి, రాష్ట్రానికి పదేళ్లు అధికారిక గీతం లేకుండా చేశారు. ఆ తప్పును సరిదిద్ది కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అధికారిక గేయంగా ప్రకటించి, అందెశ్రీని గౌరవించుకుంది. ఉద్యమంలో ఆట, పాట, గజ్జెలతో ఉత్సాహం నింపిన గద్దర్‌కి కేసీఆర్ కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానిస్తే, ప్రజా ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చి గౌరవించుకుంది.
తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్‌గా ఉద్యమా న్ని నడిపించిన కోదండరాంని ‘నేను తయారు చేసిన లక్షమందిలో ఒకడు’ అని కేసీఆర్ అగౌరపరిస్తే, కాంగ్రె స్ ఆయనకు సరైన గుర్తింపు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమానికే ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులు, తమ న్యాయ మైన డిమాండ్లను తీర్చాలని కోరితే నన్నే ప్రశ్నిస్తారా’ అనే అహంకారంతో వారిపై కక్షగట్టి సంస్థ మనుగడకే ప్రమాదం తెచ్చిన కేసీఆర్ తీరును యావత్ తెలంగాణ ఎన్నటికీ మర్చిపోదు.
అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వండి
మొదటి తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రికూడా లేకుండా పాలించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వడంతోపాటు వారి సాధికారత కోసం కృషి చేస్తున్న ఘనత కాంగ్రెస్‌ది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా మహిళలకు బాసటగా నిలిచింది. ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ అందించి మాట నిలుపుకుం ది. పేదలందరికీ ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య బీమాను రూ.10 లక్షలకు పెంచింది.
మూసీ పునరుజ్జీవనం, సుందరీకరణలో అవినీతి జరిగిందని కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద డిజైన్లు, కన్సల్టెన్సీలకు రూ.150 కోట్లు కేటాయించడం తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదనే వాస్తవాన్ని గుర్తించాలి. మూసీ సుందరీకరణ చేస్తానని గతంలో కేసీఆర్ చెప్పిన మాట గుర్తు లేదా? హుస్సేన్‌సాగర్‌లో నీటిని కొబ్బరినీళ్లుగా మారుస్తామని ఆయనే స్వయంగా చెప్పడం మర్చిపోయారా? వారు మొదలుపెట్టిన సుందరీకరణ పనులను, భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా, పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే, దానిపై అర్థం పర్థం లేకుండా విమర్శ లు చేయడం ఎంతవరకు సబబు?
పదేళ్లు అధికారంలో ఉండి, మీడియా సమావేశాలు నిర్వహించి కాకమ్మ కథలు చెప్పిన కేసీఆర్, ఇప్పుడు మౌనవ్రతం చేపట్టి ఫాంహౌస్‌కు ఎందుకు పరిమితమయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నట్టు చెప్పుకునే కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కాకుండా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్దికి సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. గడీల పాలన నుంచి గరీబోళ్ల ఇందిరమ్మ పాలన వరకు ప్రతీ విషయాన్ని చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.
-వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు
-బి.మహేశ్ కుమార్ గౌడ్