తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాదికాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు, వైఫల్యాలపైన రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక సంవత్సరం కాలంలోనే ఒక ప్రభుత్వం అద్భుతాలు సృష్టించాలని భావించలేం కానీ ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు స్పష్టమవుతాయి. ‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’ నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు రాష్ట్రంలో పాలనలో మార్పు తీసుకురాగలిగింది, కాంగ్రెస్ పాలన గత దశాబ్ద పాలనకు ఏ విధంగా భిన్నమైంది, ఎన్నికల సందర్భంగా పార్టీగా తాను ఇచ్చిన హామీలను ప్రభుత్వంగా ఎంత మేరకు నెరవేర్చగలిగింది, పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది రాష్ట్రంలో ప్రధానమైన అంశంగా మారిం ది.
ఏ ప్రభుత్వం కూడా వందకు వంద శాతం ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించలేదు కానీ ఉద్యమాల ద్వారా ఏర్పాటైన తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పాలన జరగాలనేది ప్రజల కోరిక. సంవత్సర కాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా మరికొన్ని నిర్ణయాల పట్ల అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిచేస్తూ ప్రజాపాలన చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నాయి.
చారిత్రక నిర్ణయాలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో కుల గణన, రైతు రుణమాఫీ లాంటి నిర్ణయాలు చారిత్రాత్మకమైనవనే చెప్పాలి. బీహార్‌లో జాతి ఆధారిత కులగణన తర్వాత ఆ స్థాయి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (కులగణన) దేశంలోనే రెండవదిగా చెప్పాలి. బీహార్ తరువాత అనేక రాష్ట్రాలు కులగణన చేయటానికి ముందుకు వచ్చినప్పటికీ చేపట్టలేక పోయాయి.
కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతంగా కులగణన చేపట్టటం వల్ల మెజార్టీ వర్గాల ప్రజలలో తన విశ్వసనీయతను పెంచుకుందనే చెప్పాలి. తెలంగాణలో జరిగిన కులగణన దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవటంతో కులగణన విషయంలో ప్రభుత్వా నికి మంచి మార్కులే పడ్డాయి.
ఒక రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లోనే 22 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా 18 వేల కోట్ల రూపాయల రైతు పంట రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయడం కూడా దేశ చరిత్రలో ఒక గొప్ప నిర్ణయం గానే భావించాలి. కానీ రుణమాఫీ సందర్భంగా ప్రభుత్వం రూపొం దించిన నిబంధనల వలన చాలామంది రైతులు రుణమాఫీని పొంద లేకపోవటం వల్ల ప్రభుత్వానికి రావలసిన పేరు రాకపోగా, రుణమాఫీ విషయంలో ప్రభు త్వమే అనేక విమర్శలకు తావు ఇవ్వటం వల్ల రైతుల నుండి అసంతృప్తి వ్యక్తమైంది.
దాదాపు 40 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగి ఉంటే అది ఒక చరిత్రగా మిగిలిపోయి ఉండేది. కానీ రైతు రుణమాఫీని ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్థిక భారంగా భావించిందో అప్పుడే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం పొందలేకపోయింది. ఇంకా 15 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూడటం, రుణమాఫీ సంపూర్ణం కాకపోవటంతో రుణమాఫీ చారిత్రక నిర్ణయమైనా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాన్ని పొందలేకపోయింది.
నియామకాల్లో కొత్త ఒరవడి
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో నిర్లక్ష్యం, జాప్యం వలన గత ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఉద్యమ నినాదమైన నిధులు, నీళు,్ల నియామకాలలో ఒకటైన నియామకాలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యం ఆ పార్టీని అధికారానికి దూరం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుందనే చెప్పాలి. నోటిఫికేషన్ ఎవరు ఇచ్చినా నియామకాలు చేపట్టటంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్త్తోంది.
ఈ సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టటంతో ప్రభుత్వం నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పెంచుకోగలిగింది. అభ్యంతరాలు వ్యక్తమైనా గ్రూప్-1 పరీక్షను విజయవంతంగా ముగించటం, 65 రోజులలోనే ఉపాధ్యాయ నియామకాలు, గ్రూప్-4 నియామకాలు కూడా చేపట్టటం, టీజీపీఎస్‌సీ ప్రక్షాళన చేయటం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బుర్రావెంకటేశంను చైర్మన్ గా నియమించటంతో ఉద్యోగాల భర్తీని మరింత వేగవంతం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది.
డీఎస్‌సీద్వారా దాదాపు 11 వేల ఉపాధ్యా య నియామకాలు చేపట్టటం, ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఐఐటీల ను ఏటీసీ లుగా మార్చటం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు, విద్యా కమిషన్ వంటి నిర్ణయాలతో విద్యావ్యవస్థపై తనదైన ప్రత్యేక ముద్రవేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
స్పష్టమవుతున్న అనుభవ రాహిత్యం
అయితే కొన్ని కీలకమైన విషయాలలో నిర్ణయాలలో ప్రభుత్వం అనుభవ రాహిత్యం స్పష్టమవుతోంది. హైదరాబాద్‌లాంటి ఒక మహా నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చి న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చేయాలనే సంకల్పం మంచిదే. దానికోసం చేపట్టిన హైడ్రా, మూసీ ప్రక్షాళనలాంటి చర్యలు మంచివే కానీ ఇలాంటి చర్యలు చేపట్టేటప్పుడు ప్రభుత్వం ప్రజల పక్షాన మానవీయ కోణంలో మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలసిన అవసరం ఉంది.
హైడ్రా, మూసీ ప్రక్షాళన వలన ప్రజలకు ఇబ్బందులు, ప్రజల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురైన మాట కూడా వాస్తవం. పరిశ్రమలకు భూములు సేకరించే విషయంలో కూడా ముఖ్యంగా లగచర్ల ఘటన ప్రభుత్వానికి ఒక బ్లాక్ స్పాట్ గానే భావించాలి. చట్టాలను ఉపయోగించడంలో మానవీయ కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తేనే కదా ప్రజాపాలన అనిపించుకునేది. హైడ్రా, మూసీ ప్రక్షాళన, లగచర్ల భూసేకరణ విషయంలో ప్రభుత్వం ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’ గా వ్యవహరించింది. ప్రజలలో అసంతృప్తి నెలకొన్నది కాబట్టే ప్రభుత్వం కొంత వెనకడుగు వేయక తప్పలేదు.
కీలక హామీల అమలు ఎక్కడ?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటా నికి ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామనే హామీ ఇచ్చారు. కానీ ఆరు గ్యారెంటీలలో కీలకమైనవి, ప్రజలకు విస్తృతంగా, ప్రత్యక్షంగా, ఆర్థికంగా ప్రయోజనం కలిగించే చేయూత, వృద్ధాప్య పెన్షన్లు 2000 నుండి 4వేల రూపాయలకు పెంపు, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, రైతులకు 15వేల రూపాయల రైతు భరోసా సాయం అందించక పోవటం వల్ల ఆ వర్గాల నుండి ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కలిసొచ్చిన బలహీన ప్రతిపక్షం
గత ప్రభుత్వ దశాబ్ద పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వరుస ఓటములతో, పార్టీ ఫిరా యింపులతో ప్రధాన ప్రతిపక్షం మరింత బలహీనపడటంతో పాలకపక్షంపై అటు చట్టసభలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలో బలహీన పోరాటంతో ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్షాల నుండి ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అధికారం అద్దాలమేడ లాంటిది. ప్రజలలో ఒకసారి అసంతృప్తి ,వ్యతిరేకత మొదలైతే అద్దాల మేడ క్షణాలలో కూలిపోతుంది. అది తెలంగాణలో మరొకసారి పునరావృతం కాకూడదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తే ప్రభుత్వానికి, ప్రజలకు కూడా మంచిది.
-డాక్టర్ తిరుణహరి శేషు
వ్యాసకర్త సెల్ : 9885465877