calender_icon.png 17 November, 2024 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక ఒర రెండు కత్తులు

11-11-2024 12:00:00 AM

తోటలోని పక్షులు ఎగిరిపోయాక

అలవి కాని మనాది 

గాయం లాటి

ఒక ముంపు గ్రామ నిర్వాసిత

పాటను మనిషి పాడుతున్నాడు

బంగారం తరీఖ

నగ నగిషీ తయారవుతుంది

ఎడారి బతుకులో

సైకత తుఫానుల అల్లకల్లోలాలు

పొదిగిన రెక్కల కింద పెంకును

పగలగొట్టుకుని కిచకిచ లాకర్లో

అభద్ర కలలు దాచబడుతుంటాయి

రాత్రి చీకట్లో

పోగొట్టుకున్న దానికోసమో

కోల్పోయిన దేనికోసమో

కళ్ళ టార్చ్ లైట్‌తో

ఆగమై వెతుకుతున్నాను

బేజారులో జారిపోయిందో

లేక చేజార కొట్టుకున్నానో

ఇదమిద్ధంగా ఎరుక కాలేదు

చోర విచారమైతే మిగిలిపోయింది

నల్లని ఆకాశ విశాల వస్త్రంపై

చుక్కల చంకీలను పొదిగిన

ఎంబ్రాయిడరీ పనితనం

గండిపడ్డ గుండె చెరువుకింది

పొలంలో వరినాటు వేసి

పంట దిగుబడిని ఆశించిన

జనపద కలుపు పాట

అభివృద్ధి వెలుగు నీడల ఒరలో

ఇమడని రెండు విచ్చు కత్తులు

రాజీ ఘర్షణ నడమ ఎత్తు పొత్తులు

గాయమైన గేయం

గొంతులో ఉండదు తెగించి పాడదు

ఎండిన ప్రాజెక్టులో తేలిన

చేదు యాదుల ఊర్ల ఆనవాళ్ళు

నిండు జాబిల్లి ఎన్నీలలో

జడకొప్పు ఆటపాటల

శిథిల గ్రామాల ఆర్ద్ర ప్రాణం

ఇసుర్రాయి నడమ నలిగిన

భూనిర్వాసితుల కీచుగానం.