నా హసీనాకన్న మూడేళ్ళు ముందు ఈ ప్రపంచంలోకి వచ్చే భాగ్యం నాకు లభించింది. మేమిద్దరమొకే వాతావరణంలో పెరిగిన వాళ్ళం. తిరగాడింది ఒకే వాడ. చదువుకున్నది ఒకే బళ్ళో. ఆడుకునే బొమ్మరిండ్లు కూడా ఇద్దరం కట్టుకునేది. హసీనాతో నేను ఆడుకుంటూ ఉంటే మా తాతయ్య గారికి నచ్చేదిగాదు.
“తార, శశి, ఇందిర.. ఎవరూ దొరకలేదురా! ఎప్పటికీ హసీనా! హసీనా...” అంటూ చస్తావు అని మందలించేవాడు. “ఎన్నడో తురకల్లో కలుస్తావురా...” అని ఏమేమో అనేవాడు మా పక్కింటి జానకిరామయ్య. నాకేం ఫర్వా.
తీర్చిన ముక్కు, గులాబి బుగ్గలు, తుమ్మెద లాంటి కుటిల కుంతలాలు, ఉబ్బిపోయిన రొమ్ము, పాల గులాబి వన్నె.... అంతేగాదు, హసీనా సుగుణ కూడా. కష్టపడే వాళ్ళతో సానుభూతి చూయించడం, ఇంటివాళ్ళకు తెలీకుండా సహాయం చేయడం బాగా తెలుసు. ఓర్పు, వినయం గల సుశీల. అయితే ఒక్కటుంది ఆమెలో.
అందుకే అప్పుడప్పుడు నాకు ఆమెకు తేడా అయ్యేది. అది ‘ఒక్క నిమిషం’. హసీనా సింగారింపు జ్ఞాపకమొస్తే నా కోపావేశ రసం సరిగ్గా 110 డిగ్రీల మీదనే ఆగేది. ఒక్కొక్కప్పుడు నెత్తి తిరిగిపోయేది. స్మృతి తప్పడంగా జరిగేది. నా మతి పోవుటకిది చాలదూ?
నా ఇంటిపక్కనే హసీనా వాళ్ళది చివరి అర్ర. హసీనా స్వంతంగా ఆక్రమించింది. పనితనమున్న గోడ చెక్కమీద ఒక గడియారముంది. రెండు గజాల పొడువు ఓ మేజాబల్ల చుట్టు ఒకే సెట్టులోని కుర్చీలు. మేజా పక్కనే ఓ నిలువుటద్దం ఉంది. దానిమీద రకరకాల నూనెలు, క్రీంలు, స్నోలు, పౌడర్లు రకరకాల బుడ్ల లో ఉండేవి. రిబ్బన్లు, పిన్నులు, క్లిప్పులు, బ్రష్షులు, దువ్వెన్లు, రంగురంగుల అట్టపెట్టెల్లో పెట్టి ఉండేవి.
ఆ టేబిల్ ముందు నుంచుంటే, ఓ నర్సులా కనిపించేది. ఒహ రెండుసార్లు అని అప్రయత్నంగానే పెదమల్నించి దిద్దుకుంది గూడా. ఎప్పుడైనా దిద్దడం మొదలెట్టిందంటే సరిగ్గా మూడు గంటలు అయ్యేవి. ప్రొద్దున్నే లేచి పళ్ళమీద బ్రష్షు పెట్టిందంటే అరగంట త్రిప్పిన ప్రక్కనే త్రిప్పుతూ, తొమ్మిదవడంతోనే పదేసిసార్లు పులకరిస్తూ, అక్కణ్ణుంచి తువాల్తో మొగం తుడుస్తూ అర్రలో ప్రవేశించిందంటే కాలేజి మోటారు వచ్చేవరకు పురుసత్తే. కాఫీ చల్లార్నా, నాష్తా దొరకదని తల్లి బెదిరించినా అర్ర దాటేది లేదు.
రాసిన బుగ్గమీద మళ్ళీ స్నో రాయడం తెల్ల పౌడరుమీద రోజా పౌడరు, మళ్ళీ దాన్ని తుడువడం జరుగుతూ ఉండేది. తీసిన పిన్నును పెట్టడం, పెట్టిన దాన్ని తీయడం, సరిగ్గా పెట్టరాక పోతే ‘డ్యామిట్! ఈ కంపెనీవి ఇట్లానే ఉంటాయి’ అని విరిచేస్తూ ఉండటం గూడా తటస్థించేది.
హసీనా ఇంటివాళ్ళకు, అందరికీ నేనంటే ప్రాణం. వాళ్ళు తురకాళ్ళైనా, నాకు ఘోషా పర్దా ఏం లేదు. నేనంటేనే వాళ్ళకు నమ్మకం. హసీనా, నేను రూంలో ఒంటరిగా గూర్చుండి రాత్రి పదేసి గంటలదాకా గఫాలు నరికేవాళ్ళం. సాయంత్రం గాలికని వెళ్ళేటప్పుడు తరచుగా నా కార్లో హసీనాను తీసిక వెళ్ళేవాణ్ణి. కాని తంటా వచ్చేది ‘ఒక్క నిమిషం’లో... అందుకనే ఐదున్నరకు వెళ్లేదుంటే, రెండింటికే తెలిపేది నేను. అప్పుడే ఫ్యాషన్ మొదలెట్టేది.
దిద్దుట్లో తన్మయమై పోయేది. రూం కింద హార్ను ఇచ్చి, ఇచ్చి నేను వేసట జెందేది కాని, ఈ హార్నేమీ హసీనాకు పరాకు చెందించేది కాదు. ఇదో వస్తుందేమో, అదో వస్తుందేమో అని బ్రేకు వేయడం, పెట్రోలు ఆఫ్ చేయకుండడం జరిగేది. కిటికీలోంచి చూస్తూ ‘ఒక్క నిమిషం’ అనేది. అదేం నిమిషమో, ఏం గడియారమో నాలుగు గంటలైనా ఆ నిలువుటద్దం పోనీయదామెను. అదేం ఆకర్షణ శక్తి దాన్లో, ఇదే నాకు కోపం కలిగించేది. చీవాట్లు గూడా పెట్టేవాణ్ణి.
రెగ్యులర్‌గా చూడకున్నా ఈస్టిండియా ఫిల్ము కంపెనీ వారి ‘లవకుశ’, ‘గౌహార్’, 1934- లాంటివి వస్తే మాత్రం విడిచేవాణ్ణి గాదు. ఒక స్నేహితుడైన వెంబడించాలి. ఎవరేమైనా నా హసీనా మాత్రం ఉండాలి. నే రమ్మంటే ‘రాను’ అని ఎదురుచెప్పేది గాదు. ఎంత పనున్నా సరే. అదే మేం చేసుకున్న ఘడియ. ఎవరైనా ఇంట్లో ఆడ్డానికి, చూడ్డానికి రమ్మంటే పదిసార్ల కొకసారి వెళ్లేది. మొహం చిట్లించుకొంటూ విసుక్కునేది. నన్ను డిస్టర్బ్ చేయవీళ్లేదని.
నా గది తలుపు తట్టినట్లైంది. సగం కప్పు తాగానో లేదో కో... పెట్తూ ‘సరే’ అన్నాను. “హల్లో..” అంటూ గబగబా వచ్చేసింది లోపలకి. మొహం, ఉడుపులు, ఏం కనపడ్డవి కావు. అందాజా హసీనా గావచ్చుననుకున్నా, లేకపోతే ఎవరికా ధైర్యం... నేడు మొదటి షోకి కృష్ణా టాకీస్‌లో ‘గౌహారు’ (మిస్ 1934) ఫిల్ము చూడాలె అనుకున్నా.
సాయంత్రం ఆరున్నర గంటలకు షో మొదలైనా, నాలుగింటికి పది నిమిషాలు ముందే రూంలోకి వెళ్ళింది హసీనా. గడియ వేసికొంది. మహాప్రళయంగా తీర్చుకుంటోంది. హసీనాకు ఈ ప్రపంచంలో ఏం లేదు. దేనికన్న ఎక్కువ- ఇప్పటికీ హసీనాకు పదహారేళ్లే వచ్చినా నాలుగేళ్ళు చిన్నదిగా చూపడాలని మెండు అభిలాష. మొహాన్ని సాధ్యమైనంత వరకు నున్నంగా ఉంచి, తళతళ లాడించాలనే ప్రయత్నం. ఎప్పటికీ బుగ్గల్ని అద్దాల్లా చేయడంలో నేనే నేర్పరినంటూ ఉంటుంది గూడా తన ఆంతరంగికుల్తో.
మంది మొహాలు తన బుగ్గల్లో అగుపడాలి. అవి జూచి ‘ఇంతేనా వాళ్ళందం’ అని వెక్కిరింపుల నవ్వు నవ్వాలి అని గాదు మరి. హసీనా తీర్పుదిద్దులు మందిని వెక్కిరింపడానికో, యువకులను వలల్లో చిక్కించుకోడానికో కాదు. అది నిష్కామకర్మ. నవ్వులాడ్తు, ఆరుబైట పచారు చేస్తోంటే- వెంటనుండు నాకు సంతోషం, నవ్వు తప్ప ఏది జ్ఞాపకం లేకుండేది.
ఏం చెప్పాలి- వెన్నెల రాత్రుల్లో సౌందర్య దేవిలా తీర్చిదిద్దుకొని డాబామీద నాతో గఫాలు నరుక్తూ ఉంటే బుగ్గలెట్లున్నాయో చూద్దామని, చందమామ దిగొచ్చాడు. బుగ్గలమీదనే తాండవించడం మొదలెట్టాడు. తార పిలుపు వినబళ్లేదేమో! మేము రెండు గంటలు కూర్చున్నాం. పోనేపోడు ఆ చల్లనయ్య. పాపం నటరాజమూర్తి జుట్టుమీద కూర్చుండి నేర్చుకున్న నాట్యాన్నంతా చూపెట్టాడు. కాని బృహస్పతి భార్య గాదుగా నా హసీనా వెనకా ముందు లేక వెంబడించడానికి.
ఆమె సౌందర్యం కిరణాల ప్రయోగం నన్నందగాణ్ణి చేసింది. ఆమె గంధాన్ని హరించి నాకప్పగించే వాయు కుమారునికి కృతజ్ఞత. నాకు సౌగంధిక పరికరాల్ని కొనే ఖర్చు తగ్గించాడు.
ఐదుగంటల్నించి ఐదున్నర వరకు ఛోటీబేగం... లాడ్లీ బేగం... గోరీబీ... తుదకు హసీనా అంటూ ఎన్ని విధాల పలుకరించినా వినిపించుకోలా కాఫీ చల్లారిపోయింది. “రావేమే” అనే తల్లి మాటలకి, “ఒక్క నిమిషం” అని మాత్రం కిటికీల్నించి వినబడ్డది. ఆరు గంటలైనా ఒక్క నిమిషం కాలేదేమో కాని... నిజం విచారిస్తే తీర్చడం, దిద్దడంలో మునిగి ఉన్న హసీనాకు కాఫీ, ఉప్మాలో లెఖ్ఖా!
సరిగా ఆరింటికి రూం కింది రోడ్డుమీద నా మోటారు హార్న్ వినబడ్డది హసీనాకు. “ఓహో.. వచ్చావు.. ఇదో ఒక్క నిమిషం, రిబ్బను కట్టి, బ్లూ బ్లౌజు తొడిగితే అయింది. ఎంత ఒక్కనిమిషం” అని నిష్క్రమించింది.
పది నిమిషాలైంది. ఇదేమిటి... హార్నిస్తే హసీనా తమ్ముడు జానీ వచ్చాడు. నన్ను చూస్తూనే ఇంట్లోకి తీసికెళ్ళి టీ, బిస్కెట్టు ఇచ్చాడు. మొత్తానికి టీ టాక్‌లో పావుగంట చెల్లు. ఆట మొదలు గావడానికి ఐదు నిమిషాలే.
ఇంకొక రూంలోకి పోయే వీలు లేదు. నేనే పోవాలి. నేను పోతే కొన్ని నిమిషాలన్నా తప్పకుండా అవుతాయని గబగబ కారులోకెళ్ళి హార్నిచ్చా. ఆ బంగళా కిటికీలోంచి మెరుపు మెరిసింది. “హాలో సాక్సుకి, షూజుకి మ్యాచ్ కుదరలేదు. ఎంత ఒక్క నిమిషం” అని గరుకుమనిపించింది తలని. ఆరున్నర అయింది.
ఆట విడిచే ఇష్టం లేదు. హసీనాను విడిచి పోవడానికి మనసొప్పదు. విచారించి వాయిదా వేసిన మిత్రులకి ఆశాభంగం కలుగుతుందని. “వెంటనే రావాల్సింది,- క్షమించాలి. బాక్సుకు నీక్కూడా టిక్కెట్టు కొంటా. కారు నీ కొరకుంది” అని చీటి వదిలి జాని బైస్కిల్‌మీద వెళ్ళా. ఆట మొదలు గావడం, నే బాక్సులో గూర్చోవడం ఒకేసారి.
ఇగోలేదు... అగోలేదు. మంచి సీనపుడు “చూశావు హసీనా” అనేవాణ్ణి (అలవాటు గనుక) వేలు గరచుకునే వాణ్ణి (లేదుగాన). నా పక్క ఏ చప్పుడైనా హసీనా అనుకునే వాణ్ణి. ఫిల్ము బాగున్నా హసీనా లేకపోవడంతో ఎంత ఆనందించాలో అంత ఆనందించలా. జాని సైకిలిచ్చేసి పోయేటప్పుడైనా హసీనాను చూద్దామని హార్నిచ్చా- “మిస్టర్ బూచు పెట్టుకునేదే ఆలస్యం, వెళ్దాం ఫిల్ముకి. ఎంత ఒక్క నిమిషం” అంది హసీనా.- ఒక్క నిమిషం అంటూ హసీనా ఆతురత పడడం, నేను కార్లోంచి స్పష్టంగా తొంగిచూశాను.
ప్రచురణ కాలం: 1935 డిసెంబర్ 12, ‘గోలకొండ’ పత్రిక ‘మెతుకు కతలు’ సౌజన్యంతో..