02-04-2025 11:54:13 PM
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మమ్‌ఫుజ్ ఆలమ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన దాదాపు లక్ష మంది కార్యకర్తలు భారత్‌కు పారిపోయి ఆశ్రయం పొందుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రంజాన్ సందర్భంగా తాత్కాలిక ప్రభుత్వం ఢాకాలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హసీనా ప్రభుత్వ హయాంలో అదృశ్యమైన లేదా ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబసభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహ్‌ఫుజ్ ఆలమ్ మాట్లాడుతూ.. ‘ అవామీ లీగ్‌ను వ్యతిరేకించిన వారిని ఉగ్రవాదులు, మిలిటెంట్లుగా ముద్ర వేసి వారిని కన్పించకుండా చేశారు. ఇప్పుడు కూడా భారత్‌లో కూర్చొని బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. షేక్ హసీనాతో పాటు లక్ష మందికి పైగా అవామీ లీగ్ కార్యకర్తలు ఆ దేశానికి పారిపోయారు. వారికి భారత్ ఆశ్రయం ఇవ్వడం దురదృష్టకరం. తన తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారంగా హసీనా దేశంలో పలు అక్రమాలకు పాల్పడ్డారు. ఎదురుతిరిగిన వారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడలేదు. 2013 ఓటు హక్కు కోసం పోరాడుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి’ అని ఆరోపించారు.