- ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం ముందుండాలి
- పురోగతి లేని కంపెనీల అనుమతులు రద్దు
- మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : పామాయిల్ రైతులకు అధిక ధరలను అందిస్తూ.. ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పామ్ ఆయిల్ కంపెనీల పురోగతిపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో ఉంచాలని, ఆ దిశగా చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. పురోగతి చూపించని ఆయిల్ కంపెనీలపై అసహనం వ్యక్తం చేస్తూ తీరు మార్చుకోకుంటే అనుమతులు రద్దు చేసి, టీజీ ఆయిల్ ఫెడ్‌కు కేటాయిస్తామని హెచ్చరించారు.
వచ్చే ఏడాది చివరి నాటికి ప్రతి కంపెనీకి కేటాయించిన జోన్లలో ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 64,040 హెక్టార్లలో ఆయిల్ పాం ప్లాంటేషన్ చేశామన్నారు. ప్రతి యేటా 40వేల హెక్టార్లలో సాగే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
2024- సంవత్సరంలో లక్ష ఎకరాల ప్లాంటేషన్ లక్ష్యాన్ని పెట్టుకోగా.. ఇప్పటివరకు 25,470 ఎకరాల్లో పూర్తిచేసుకున్నట్లు తెలిపారు. ఆయా కంపెనీలకు కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ కర్మాగారాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి కంపెనీ నర్సరీని కలిగి ఉండాలని, లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేసేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ధర టన్నుకు రూ.19,144కు పెరగిందని, ఈ ఏడాదిలోనే టన్నుకు రూ.6వేలకు పైగా పెరిగిందన్నారు.
కొనుగోలు కేంద్రం తనిఖీ
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పలువురు కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను విధిగా సందర్శించేలా చూడాలని ఆదేశించారు. రైతులు కూడా నిబంధనల మేరకు తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు..