- మూత్రపిండ సమస్యల బాధితుల్లో తెలుగు రాష్ట్రాలే టాప్
- తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీలో కిడ్నీ సమస్యలతో బాధపడతున్న పిల్లల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు.. ఏపీలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఇంపైర్డ్ కిడ్నీ ఫంక్షనింగ్(ఐకేఎఫ్)తో ఇబ్బంది పడుతున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. ఐకేఎఫ్ అంటే కిడ్నీ పనితీరు మందగించడం. మూత్రపిండాల పనితీరు బలహీనపడటం అనేది సమస్యకు సంబంధించి ప్రారంభ దశ. ఇది మూత్రపిండాల పనిలో అన్నీ సరిగ్గా లేవని సూచిస్తుంది.
దీన్ని నిర్లక్ష్యం వహిస్తే మూత్రపిండాల వైఫల్యం, తర్వాత ప్రాణాలకు ముప్పుగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ఒకరు కిడ్నీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. దేశంలో కిడ్నీ సమస్యతో ఎక్కుమంది చిన్నారుల బాధపడుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 29.6 శాతంతో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 19.2 శాతంతో రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4.9 శాతం ఉన్నట్లు పరిశోధన లేల్చింది. తొలుతో ఐకేఎఫ్‌తో ప్రారంభమై కాలం గడిచేకొద్దీ ఈ సమస్య మరింత జటిలమై క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)గా రూపాంతరం చెందుతుందని అధ్యయనం చెబుతోంది. భారత్, యూకే, ఆస్ట్రేలియాకు చెందిన ఆరోగ్య నిపుణుల బృందం ఈ పరిశోధన చేసింది. ఈ అధ్యయనం బీఎంసీ పీడియాట్రిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది.
పరిశోధకులు 5 ఏళ్ల వయస్సు గల 24,690 మంది పిల్లలు, కౌమారదశలో ఉన్న వారిని పరిశీలించారు. భారత్‌లో ప్రతి 10 లక్షల మంది జనాభాలో 49,000 మంది ఐకేఎఫ్‌తో బాధపడుతున్నట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బాధితులు ఎక్కువగా ఉన్నట్లు గతంలోనూ కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఇందులో ప్రపంచంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏపీలోని ఉద్దానం అని అందిరికీ తెలిసిందే. తెలంగాణలో పాటు ఏపీలో ఇతర ప్రాంతాల్లోనూ కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాధితుల్లో సగానికి పైగా వ్యక్తులకు వారి సమస్య గురించి తెలియకపోవడం గమనార్హం. తాజా అధ్యయనంలోనూ పిల్లలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు వారి తల్లిదండ్రులకు తెలియదని పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్య సదుపాయాలు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.
కారణాలు ఇవే..
* కలుషిత నీటి వల్ల ఈ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
* ఊబకాయంతో ఉన్న చిన్నారులు ఐకేఎఫ్ బారినపడొచ్చు.
* లూజ్ మోషన్స్‌తో పిల్లల్లో ఐకేఎఫ్ సమస్య తలెత్తొచ్చు.
* కుటుంబంలో ఇదివరకు ఎవరైనా కిడ్నీ సమస్య ఉన్నా, వారసత్వంగా ఈ సమస్య వచ్చే అవకాశముంది.
* మాంసాహారం ఎక్కువ తినే పిల్లలోనూ ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు.
* వాతావరణం, ప్రాంతం, ఉష్ణోగ్రత, ఆహార పద్ధతులు కూడా ఐకేఎఫ్‌కు కారణం అవుతాయని చెబుతున్నారు.