- పెద్ద అంబర్‌పేట్‌లో ఎక్సైజ్ పోలీసులకు చిక్కిన ముఠా
- ఎనిమిది మంది అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): మత్తు పదార్థాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో అక్రమార్కులు కొత్తదారులుఎంచుకుంటున్నారు. ఎవరి కంట పడకుండా ఒక వ్యానుకు మార్పులు చేసి అందులో గంజాయిని తరలిస్తుండగా, ఎక్సైజ్ పోలీసులు వారి గుట్టురట్టు చేశారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ వివరాలు వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని పెద్ద అంబర్‌పేట్ ప్రాంతంలో శుక్రవారం ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ అడిషనల్ ఎస్పీ భైరి భాస్కర్, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఒక వ్యాను, దాన్ని అనుసరిస్తూ మరో కారు రావడం ఎక్సైజ్ పోలీసులు గమనించారు.
అనుమానం వచ్చి ఆ వాహనాలను ఆపి తనిఖీ చేసి వారిని విచారించగా.. వ్యానును మాడిఫై చేసి అందులో గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఆ వ్యానులో చూడగా 170 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. గంజాయి విలువ సుమారు రూ.34 లక్షలు ఉంటుందని తెలిపారు. రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
ఒడిశాటు మహారాష్ట్ర.. వయా హైదరాబాద్
ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు నిందితులు గంజాయిని తరలిస్తున్నట్లు ఎక్సైజ్ జేసీ ఖురేషీ తెలిపారు. అరెస్టయిన వారిలో ఐదుగురు మహారాష్ట్ర, ముగ్గురు ఒడిశాకు చెందిన వారని చెప్పారు. వారిలో ఒడిశాకు చెందిన ఇస్మాయిల్ తురికి అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు. అతడిపై మధ్యప్రదేశ్‌లోనూ గంజాయి కేసులున్నట్లు చెప్పారు.
ఒక కేసులో 11 నెలల పాటు రిమాండ్‌లో ఉన్నాడని, నాలుగేళ్లు జైలు శిక్ష కూడా పడగా ప్రస్తుతం అపీల్‌లో ఉన్నాడని చెప్పారు. అరెస్టయిన వారిలో మహారాష్ట్రకు చెందిన ఎండీ ఆసిఫ్, శైలేంద్రకారత్ అలియాస్ బంటి, జీవన్ నానా నిఖిత్, కేవల్ వినయ్ మఖరే, అమర్, ఒడిశాకు చెందిన ధర్మారాజు, లక్ష్మీనారాయణ బారిక్ ఉన్నారు.