calender_icon.png 5 February, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు వందశాతం శాస్త్రీయత

05-02-2025 02:28:16 AM

  1. సర్వే ఆధారంగానే ‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్లు.. 
  2. బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపులు
  3. అసలు సర్వేలో పాల్గొనని వారి సంఖ్య 3.56 లక్షలు
  4. వారిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నరు..
  5. వారు ఇప్పుడు వివరాలు ఇస్తామన్నా తీసుకుంటాం..
  6. శాసనమండలిలో సర్వే నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కులగణనకు వందశాతం శాస్త్రీయత ఉందని, ఈ సర్వే ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. సర్వే ఫుల్ బాడీ చెకప్ లాంటిదని అభిప్రాయపడ్డారు.

మంగళవారం ఆయన శాసనమండలిలో కులగణన నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నదని వివరించారు.

ఆయా వర్గాలకు మేలు చేసేందుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో బీసీ లు 56.33 శాతం మంది ఉన్నారని సర్వేలో తేలిందన్నారు. రాష్ట్రంలో 3.56 లక్షల మంది అసలు సర్వేలోనే పాల్గొనలేదని, వారిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి వారున్నారని దుయ్యబట్టారు. వారంతా ఇప్పుడు సర్వేకు సహకరిస్తామని, వారి వివరాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వారి సర్వే.. ఒక కుటుంబానికే పరిమితం

బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుం బ సర్వే కేవలం ఒకే కుటుంబానికి పరిమితమైందని డిప్యూటీ సీఎం విమర్శించారు. ఒకరోజులో.. ఆరుగంటల్లో సర్వే పూర్తి చేయడం అశాస్త్రీయమని అభిప్రాయపడ్డారు. పైగా నాటి ప్రభుత్వం చట్టసభలో ప్రవేశపెట్టలేదని గుర్తుచేశారు. అసలు సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు చేపట్టారో నాటి ప్రభుత్వ పెద్దలకే తెలియదని ఎద్దేవా చేశారు.

తమ ప్రభుత్వం 4 ఫిబ్రవరి 2024న సర్వే చేపట్టాలనే నిర్ణయం తీసుకుందని, ఇదే ఏడాది ఫిబ్రవరి 16న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. అక్టోబర్ 19న సర్వేపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పడిందని వెల్లడించారు. సర్వే నిర్వహణపై తాము ముందుగానే ప్రజాసంఘాల నేతలు, సామాజికవేత్తలు, మేధావుల మేధోమథనం చేశామని వివరించారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుం బాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించామని, అలా మొత్తం 94,261 బ్లాకుల్లో సర్వే చేపట్టినట్లు వివరించారు. సర్వేలో 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజరు భాగస్వాములయ్యారని తెలిపారు.

50 రోజుల్లో పూర్తయిందని, సర్వే పూర్తయ్యే సమయానికి గ్రామీణ ప్రాంతంలో 66,99,62 కుటుంబాలు, పట్టణ, నగర ప్రాంతంలో 45, 15, 532 కుటుంబాలు ఉన్నాయని, వాటిలో ఎన్యూమరేటర్లు 1,12,15,1134 కుటుంబాలను సర్వే చేశాయని స్పష్టం చేశారు. ఆయా కుటుంబాల నుంచి 3,54,77,554 మంది సర్వేలో పాల్గొన్నారు.

నివేదికలోని వివరాలు..

* తెలంగాణవ్యాప్తంగా ఎస్సీలు 61,84,3119 మంది ఉండగా, రాష్ట్రంలో వీరిశాతం 17.43.

* బీసీలు (ముస్లిం మైనారిటీలు మినహా) 1,64,09,179 మంది ఉండగా, రాష్ట్రంలో వీరి శాతం 46.25.

* ముస్లిం మైనార్టీలు 44,57,012 మంది ఉండగా, రాష్ట్రంలో వీరి శాతం 12.56.

* ముస్లిం మైనారిటీ బీసీలు 35,76,588 మంది ఉండగా, రాష్ట్రంలో వీరిశాతం 10.08.

* ముస్లిం మైనారిటీ ఓసీలు 8, 80,424 మంది ఉండగా, రాష్ట్రంలో వీరిశాతం 2.48.

* ముస్లిం మైనారిటీలు మినహా ఓసీల జనాభా 47,21,115, రాష్ట్రంలో వీరిశాతం 13.31.