అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేయడమే ఈ మూవీ మొదలవ్వ డానికి కారణం.
తర్వాత హరితహారం గురించి తెలుసుకున్నా. ఈ చిత్రం అందరికీ కనువిప్పు కలిగేలా, సందేశాత్మ కంగా ఉంటుంది. నేను మా నిర్మాత రాజేందర్ రెడ్డికి మాస్ కమర్షియల్ కథలు చెప్పా.. లాభాలు వస్తాయని చెప్పా. కానీ మా నిర్మాత మాత్రం సింబా కథను ఎంచుకున్నారు. సమాజానికి మంచి చేయాలనే, ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం చేశారు. అలాంటి మంచి వ్యక్తి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు.. అందరినీ మెప్పిస్తుంది.. ఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కు లు వేస్తారు’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులు, చిత్రబృందం కూడా మాట్లాడి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.