ఐసీసీ టోర్నీల్లో దాయాది పాకిస్థాన్‌పై అనితర సాధ్యమైన రికార్డు ఉన్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తొలిసారి సింగిల్ డిజిట్ స్కోరుకు వెనుదిరిగాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆరుసార్లు పాకిస్థాన్‌తో ఆడిన కోహ్లీ.. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలు సాధించగా.. తాజా పోరులో నాలుగు పరుగులే చేసి వెనుదిరిగాడు. 2012లో తొలిసారి పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తలపడ్డ విరాట్.. అజేయంగా 78 పరుగులు బాదాడు. 2014లో 36 నాటౌట్.. 2016లో 55 నాటౌట్.. 2021లో 57 రన్స్ కొట్టిన కోహ్లీ.. గత వరల్డ్‌కప్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన విషయం విధితమే. ఛేదనలో ఆశలన్నీ అడుగంటిన వేళ.. ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
చిరకాల ప్రత్యర్థిపై సూపర్ రికార్డు ఉన్న కోహ్లీ.. ఈ సారి కూడా అదే జోరు కనబరుస్తాడని.. అభిమానులు కోటి ఆశలు పెట్టుకోగా.. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో విరాట్ నిరాశ పరిచాడు. తొలి ఓవర్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోని కోహ్లీ.. వర్షం బ్రేక్ తర్వాత రెండో ఓవర్‌లో ఫేస్ చేసిన మొదటి బాల్‌ను బౌండ్రీకి తరలించాడు. అదే ఊపులో మరో షాట్ ఆడే క్రమంలో క్రీజుకు దూరంగా వెళ్తున్న బంతిని కవర్స్ ఫీల్డర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమైన కోహ్లీ.. ఈసారి కూడా రెండంకెల స్కోరు దాటకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
ఇతర ఆటగాళ్లతో పోల్చుకుంటే.. టెక్నిక్, ట్యాలెంట్ విషయంలో చాలా ఉన్నతంగా ఉండే కోహ్లీ.. ఇలాంటి ముఖ్యమైన టోర్నీల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం కావడం చాలా అరుదు. స్ట్రయిక్‌రేట్ పై ఎన్నివిమర్శలు వచ్చినా.. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించి.. కుదురుకున్నాక జోరుగా ఆడే అలవాటు ఉన్న విరాట్.. ప్రస్తుతం అందుకు భిన్నంగా ప్రయత్నించి విఫలమవుతున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అదరగొట్టి ఫుల్ ఫామ్‌తో వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన కోహ్లీ.. మెగాటోర్నీకి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
దీంతో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటైనా.. న్యూయార్క్ పరిస్థితులకు ఇంకా అలవాటు పడలేదేమో అనుకొని ఊరుకున్న అభిమానులు కూడా పాకిస్థాన్‌పై కోహ్లీ ప్రదర్శనతో పెదవి విరుస్తున్నారు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న కోహ్లీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు వల్లే ఈ పరిస్థితికి ప్రధాన కారణం అనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
మూడో మ్యాచ్‌లో మార్పు తప్పదా!
ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా.. జాతీయ జట్టు తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ చాన్నాళ్లుగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్‌తో పాటు ఓపెనర్లు మారినా.. కోహ్లీ వన్‌డౌన్ స్థానంలో మాత్రం దశాబ్దానికిపైగా ఎలాంటి మార్పులేదు. అలాంటిది ఐపీఎల్లో ఓపెనర్‌గా అదరగొడుతున్నాడనే కారణంతో పాటు.. మరో ఆల్‌రౌండర్‌కు తుదిజట్టులో చోటు కల్పించొచ్చనే లక్ష్యంతో విరాట్‌ను వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ ఆరంభించి ఎన్నో అద్వితీయ ప్రదర్శనలు కనబర్చిన కోహ్లీ.. టీమిండియా తరఫున మాత్రం సేమ్ సీన్ రిపీట్ చేయలేకపోయాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 1,4 పరుగులు చేశాడు.
కోహ్లీ కాకుండా మరే ప్లేయర్ అయినా ఈ గణాంకాలు నమోదు చేస్తే పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. టీమిండియా తురుపుముక్క.. ప్రధాన టోర్నీలో జట్టు భారాన్ని మోసే మూలవిరాటే ఇలాంటి స్కోర్లు చేస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా వస్తే.. మిడిలార్డర్‌లో అదనంగా మరో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఆడించవచ్చనే ఆలోచన మంచిదే అయినా.. అపార అనుభవం ఉన్న ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. త్వరగా ఔటైతే.. ఆ తర్వాత యాంకర్ రోల్ పోషిస్తూ.. జట్టును ముందుకు నడిపించడం ఎంత కష్టమో పాక్‌తో పోరుద్వారా మెనేజ్‌మెంట్‌కు అర్థం అయ్యే ఉటుంది.
టీ20 వరల్డ్‌కప్ కెరీర్‌లో మూడో స్థానంలో 24 సార్లు బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరు చేయగా.. ఇరత స్థానాల్లో మూడుసార్లు బ్యాటింగ్ చేసి మూడింట్లోనూ ఒకే అంకెకు పరిమితమయ్యాడుఉ. దీన్ని బట్టి చూస్తే.. విరాట్ వన్‌డౌన్‌లో ఆడటమే సరైందనే వాదిస్తున్న వారి మాటల్లోనూ నిజం ఉందని నమ్మక తప్పదు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం వాటిల్లడంతోనే అభిమానులు అసహనానికి గురికాగా.. ఇక మ్యాచ్ మొదలైన రెండో ఓవర్‌లోనే పరుగుల వీరుడు వెనుదిరగడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తిరిగి విరాట్ తన మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి!