calender_icon.png 25 November, 2024 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్డింగ్ స్లాబ్ కూలి ఒకరు మృతి

17-05-2024 02:03:54 AM

ముగ్గురికి గాయాలు,  ఒకరి పరిస్థితి విషమం

బిల్డింగ్ యాజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు

బిల్డింగ్ ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారుల నోటీసులు 

పటాన్‌చెరు, మే 16 (విజయక్రాంతి) : బిల్డింగ్ స్లాబ్, రెయిలింగ్ గోడ పక్కనే ఉన్న రేకుల ఇంటిపై కూలడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే బిల్డింగ్‌లో నిద్రిస్తున్న మరో వ్యక్తిపై స్లాబ్, రెయిలింగ్ గోడ పడి గాయపడ్డాడు. ఈ ఘటన బొల్లారం మున్సిపా లిటీలోని లక్ష్మీనగర్ గురువారం అర్థరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్(50) కొన్ని సంవత్సరాల నుంచి బొల్లారం మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్‌లోని ఓ రేకుల ఇంటిలో నివాసం ఉంటూ రెడ్డీస్ ల్యాబ్‌లో సెక్యురిటీగా ఉద్యోగం చేస్తున్నాడు.

ఇతనికి భార్య సబిత, కొడుకు రాకేశ్ ఉన్నారు. గురువారం రాత్రి 12గంటల సమయంలో జయదేవ్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఇంటికి అనుకొని ఉన్న జీ ప్లస్ టూ భవనం పై అంతస్తు స్లాబ్, రేలింగ్ గోడ కూలి రేకుల ఇంటిపై పడింది. ఇంట్లో నిద్రిస్తున్న జయదేవ్ కుటుంబ సభ్యులపై రెయిలింగ్ గోడ పడడంతో జయదేవ్ మృతి చెందగా భార్య సబిత, కొడుకు రాకేశ్‌కు గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలో ఉన్న ప్రైవేటు దవాఖానకు తరలించారు. స్లాబ్ కూలిన బిల్డింగ్‌లోనే పై అంతస్తులో నివాసం ఉంటున్న ఒడిసా రాష్ట్రానికి చెందిన దాపాంకర్‌దాస్ నిద్రిస్తున్న సమయంలో స్లాబ్, రేలింగ్ గోడ పడడంతో కుడికాలు పూర్తిగా విరిగింది.

ఇతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సంఘటన స్థలాన్ని బొల్లారం సీఐ గంగాధర్ పరిశీలించి బిల్డింగ్ యాజమానిపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పవన్ బిల్డింగ్ యాజమానికి నోటీసులు ఇచ్చారు. భవనంలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయాలని సూచించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని బీజేపీ నాయకుడు ఆనంద్‌కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వరప్రసాద్‌రెడ్డి పరామర్శించారు.