calender_icon.png 29 October, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోమోస్ తిని ఒకరి మృతి

29-10-2024 02:53:04 AM

  1. మరో 60 మందికి అస్వస్థత
  2. మోమోస్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28(విజయక్రాంతి): నగరంలో వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వ హిస్తున్నా వ్యాపారుల్లో మార్పు రావడంలేదు. బంజారాహిల్స్ ప్రాంతంలో ఇష్టంగా తిన్న ఆహా రమే ప్రజల పాలిట విషంలా మారింది. రోడ్డు పక్కన లభించే మోమోస్ తిని ఒక మహిళ మృతిచెందగా సుమారు 60 మంది అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైనవారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం(29)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 60 మంది వాటిని తిన్నారు.

వీరందరికీ శనివారం నుంచి వాం తులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో బంజారాహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మోమోస్ తిన్నవారిలో దాదాపు 10 మంది మైనర్లు ఉన్నారు. రేష్మ బేగం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె మృతిచెందినట్లు  కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ సంఘటనపై ఇప్పటికే బాధితుల కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో మోమోస్ విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగిం చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మోమోస్‌తో పాటు ఇచ్చే మయానైజ్, మిర్చి చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏదైనా ఫిర్యాదు అందితేనో, ఇలాంటి ఘటనలు జరిగేతేనో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందిస్తారనీ, కొద్ది రోజులు గడిచాక షరామామూలే అనే విధంగా  తనిఖీలను ఆపేస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. 

మోమోస్ తయారు చేసిన సంస్థ సీజ్..

నగరంలో ప్రస్తుతం ఏ వీధిలో చూసిన మోమోస్ లభిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మోమోస్‌ను ఇష్టంగా లాగిస్తున్నారు. ఇంకేముంది దొరికిందే అ దునుగా మోమోస్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 

ఎలాంటి అను మతులు లేకుండా మోమోస్ తయారీ, విక్రయిస్తున్న సంస్థను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేసినట్లు గుర్తించి శాంపిల్స్ సేకరించారు. సదరు సంస్థకు ఎలాంటి అనుమతులు లేనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.