calender_icon.png 1 October, 2024 | 4:50 PM

వరద బాధితులకు ఒకరోజు వేతనం

04-09-2024 03:30:00 AM

సుమారు రూ.100 కోట్ల సహాయం ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ సీఎం, సీఎస్‌కు సంఘాల వినతి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వరద బాధితుల సహాయార్థం ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో  సీఎస్ శాంతి కుమారిని జేఏసీ నాయకులు డా.నిర్మల, కే రామకృష్ణ, అశ్వద్దామరెడ్డితో పాటు లచ్చిరెడ్డి  కలిశారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒకరోజు వేతనం (సుమారు రూ.100 కోట్ల)ను సీఎం సహాయనిధికి ప్రకటిస్తూ, ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఒప్పంద పత్రాన్ని సీఎస్‌కు అందించారు.

అలాగే డా.బీఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు కూడా తమ ఒకరోజు వేతనాన్ని (సుమారు రూ.70లక్షలు) సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎస్ శాంతి కుమారిని కలిసి ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో తమ ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి అందిస్తున్నామని తెలిపారు. 

కాగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ జేఏసీ ఎంప్లాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయార్థం ఒకరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు తీర్మాణ పత్రాన్ని అందించారు. అయితే వరద బాధితుల సహాయార్థం ఇస్తున్న ఒకరోజు వేతనాన్ని ఉద్యోగ జేఏసీ నాయకులు వేర్వేరుగా ప్రకటించడం పట్ల రాష్ట్రంలో పలువురు ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేశారు.