calender_icon.png 21 September, 2024 | 6:06 AM

సీఎం సహాయ నిధికి ఉద్యోగుల ఒకరోజు వేతనం

20-09-2024 01:42:19 AM

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లు, కార్మికుల ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించేందుకు ఆఫీసర్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని డిపార్ట్‌మెంట్లలోని డ్రాయింగ్, డిస్‌బర్సింగ్ ఆఫీసర్లందరూ ఉద్యోగులకు అక్టోబర్ జీతంలో ఒకరోజు వేతనాన్ని తగ్గించి సీఎంఆర్‌ఎఫ్‌లో క్రెడిట్ చేయాలని ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు తెలిపారు.

ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, సెక్రటేరియట్ ఉద్యోగులు అందరూ బాధితులను ఆదుకునేందుకు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి అభ్యర్థన మేరకు సెప్టెంబర్ వేతనంలో ఒకరోజు మూల వేతనాన్ని ఉద్యోగుల జీతంలో మినహాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే అక్టోబర్‌లో వచ్చే జీతంలో ఒకరోజు వేతనం అందరికీ తక్కువగా రానుంది.  సీఎంఆర్‌ఎఫ్‌లో క్రెడిట్ చేసిన తర్వాత ఆ వివరాలను అందజేయాలని  ఆర్థిక శాఖ ఆదేశించింది.