calender_icon.png 23 December, 2024 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజొకటి వస్తోంది..!

26-08-2024 12:30:00 AM

పంచభూతాలూ నిన్ను వ్యతిరేకిస్తాయి ఊపిరి సలపని వాతావరణం నిన్ను చుట్టు ముడుతుంది నీ తప్పులన్నీ నీకు తెలిసొచ్చే రోజొకటి వస్తోంది ఘడియ ఘడియకూ నువ్వు కదిలినా కదలక పోయినా కాలం ఆగదు క్షణాల బ్రతుకు ముళ్ళు తిరుగుతూనే వుంటది అన్ని రోజులూ నీవి కావు నిన్ను మడత బెట్టి కడిగేసే రోజొకటి వస్తది వందిమాగదులంతా చెల్లా చెదరై పోతారు ఉన్న పళంగా అతికిచ్చుకున్న బలమంతా పురాతన గోడలా కుప్ప కూలుతుంది

దుఃఖం రాల్చిన మట్టిదిబ్బలమధ్య నీ అసలు అస్తిత్వ ఆనవాళ్లను తడుముకునే రోజొకటి వస్తోంది చరిత్ర పుటల్ని తిరగేసి చూడు విర్రవీగే వెర్రి నియంతలంతా కాలగర్భంలో కలిసి పోయారు ఏదీ శాశ్వతం కాదు.. శిఖరంపై ఉన్నాననీ చిటికెలు మిటకరియ్యకు పాతాళంలో పడిపోయే రోజొకటి వస్తోంది అసామాన్య ఆవులింతలు తీయకు నిద్రమత్తు వొదిలి నిజాలు తేటతెల్లమై పోతాయి అప్పుడు... దేహమూ మనసూ బోధివృక్షం ముందు మోకరిల్లుతాయి చేతులు కాలిపోయి వుంటాయి పత్ర హరితాలేవీ కానరావు నిరంతర ఆత్మఘోషలోంచి నీ మనిషితనం గుర్తొచ్చే రోజొకటి తప్పక గుర్తొస్తుంది..!