శాసనసభ ప్రాంగణంలో రెండో విడుతను ప్రారంభించనున్న సీఎం రేవంత్
రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు ఏర్పాట్లు
రైతునేస్తం ద్వారా లక్ష రుణమాఫీపై సందేహాలకు సమాధానం
ఆగస్టులో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రెండో విడుత రుణమాఫీ రూ. లక్షన్నర పథకం మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శాసనసభ ప్రాంగణం లో ప్రారంభించనున్నారు. లక్షన్నర రూపాయల రుణమాఫీ కూడా బ్యాంకుల్లోని రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ. లక్షవరకు జరిగిన రుణమాఫీలో సందేహాలు ఉన్న రైతులు, అక్కడ ఉన్న అధికారులు, బ్యాంకర్లతో నివృత్తి చేసుకోవాలని వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రూ. లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమం వీక్షించాలని రైతులను కోరా రు. మా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని, విమర్శించే పెద్దలకు, గత ప్రభుత్వం అనుసరించిన అసమంజన విధానాలను గుర్తుచేస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. ప్రతిసంవత్సరం ఒక కొత్త విధానం తో రైతాంగాన్ని ఆందోళనలో నెట్టడమే గత ప్రభుత్వ విధానంగా ఉండేదన్నారు. ఒక సంవత్సరం రైతులు వారి మాటలు నమ్మి కంది పంట వేస్తే కందులు కొనే నాథుడే లేరని.. పంటకాలనీలు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని తరువాత దాని ఊసే లేదన్నారు.
వరి వేస్తే ఉరి అన్నారని, ఆమాటలు నమ్మి మొక్కజోన్న వేస్తే కొనుగోలు సమయానికి మొహం చాటేశారని చెప్పారు. సన్నాల సాగు అని సన్నాయి నొక్కులు నొక్కి తీరా మార్కెటింగ్‌కు వచ్చే సరికి బోనస్ కాదు కదా మద్దతు ధర కూడా దక్కలేదన్నారు. ఇంకా రుణమాఫీ 2014, 2018లో ఆసలు రుణమాఫీ పథకాలు కాకుండా అవి వడ్డీ మాఫీ పథకాలు అని ఏ రైతును అడిగినా చెబుతాడన్నారు. మొదటిసారి నాలుగు విడుతలుగా, రెండవసారి ఐదు సంవత్సరాల్లో కొద్ది మందికి ఇవ్వడంతో రైతులకు కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయిందన్న విషయం వారికి కూడా తెలుసని మంత్రి దుయ్యబట్టారు. తమది చేతల ప్రభుత్వమని ఆగస్టులో రూ. 2లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు.