calender_icon.png 26 December, 2024 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్‌కు మరోసారి

26-12-2024 01:56:54 AM

  1. రీరిలీజ్‌కు సిద్ధంగా రాజమౌళి, నితిన్ కాంబో ‘సై’ సినిమా
  2. 27 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న మెగాస్టార్ ‘హిట్లర్’ 
  3. సిద్ధార్థ్ ‘ఓయ్’ చిత్రం కూడా.. 

ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా అలరించారొకరు.. విలన్‌తో రగ్బీ ఆటకు ‘సై’ అన్నారు మరొకరు.. అప్పటివరకు ఉన్న తన ఇమేజ్ భిన్నమైన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించిన చిత్రం ‘హిట్లర్’. యువ కథానాయకుడిగా ప్రేక్షకులకు వినోదం పంచిన నితిన్ కెరీర్‌లో మైలురాయిగా మారిన సినిమా ‘సై’.

ఈ సినిమాలు నూతన సంవత్సరాది సందర్భంగా రీరిలీజ్‌కు సిద్ధమయ్యాయి. సిద్ధార్థ్ నటించిన ‘ఓయ్’ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా ముచ్చటగా మూడు సినిమాలు ఆంగ్ల సంవత్సరాదిన అందుబాటులో ఉండనున్నాయన్న మాట! 

ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో చిరు నటించిన హిట్లర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘హిట్లర్’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1997, జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా చిరంజీవికి ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఇందులో మెగాస్టార్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా నటించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ జనవరిలోనే మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి సినీచిత్ర బ్యానర్ వారు న్యూ ఇయర్ సందర్భంగా 2025 జనవరి 1న రీ రిలీజ్ చేయనున్నారు.  

లేటెస్ట్ సౌండ్ సిస్టమ్‌తో మళ్లీ వస్తున్న సై 

టాలీవుడ్ హీరో నితిన్ ‘ఇష్క్’ సినిమా ఇటీవలే రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. ఆయన నటించిన మరో చిత్రం ‘సై’ కోసం సినీప్రియులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రం 2004లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు రీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. 4కే అల్ట్రా హెచ్‌డీ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. లేటెస్ట్ సౌండ్ సిస్టమ్‌తో మెగా ప్రొడక్షన్స్ వారు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న థియేటర్లలో అందుబాటులో తెస్తున్నారు. జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

ఏ భారతి నిర్మాత. ఈ సినిమా కథ మొత్తం రగ్బీ ఆట చుట్టూ, ఒక కాలేజీలోని రెండు గ్రూప్‌లు, ఒక విలన్ చుట్టూ తిరుగుతుంది. తమ కాలేజ్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించే విలన్‌తో హీరో టీమ్ రగ్బీ ఆట పోటీకి దిగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందనేది క్లుమైక్స్‌లో దర్శకుడు జక్కన్న అద్భుతంగా చూపించారు. 

విషాదాంతమయ్యే ప్రేమకథ ఓయ్

సిద్ధార్థ్, షాలిని జంటగా నటించిన చిత్రం ‘ఓయ్’. ఈ సినిమాకు ఆనంద్ రంగా దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. సాడ్ ఎండింగ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలై, ప్రేక్షలకు అసంతృప్తే మిగిల్చింది.

గదత ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భం గా రీ రిలీజ్‌కు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా మరోమారు న్యూ ఇయర్ సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2025, జనవరి 1న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.