08-02-2025 01:56:14 AM
* నేతకానీలకు అన్యాయం జరుగకుండా చూస్తా
* ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చినపుడు 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ఏ లెక్క ప్రకారం 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శుక్రవారం నేతకానీల నిరసన గళం పేరిట సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితుల్లో ప్రథమ స్థానంలో మాదిగలు, తర్వాత మాలలు, మూడో అతిపెద్ద జనాభాగా నేతకానీ కులస్థులు ఉన్నారన్నారు.
నేతకానీలకు అన్యాయం జరుగకుండా చూస్తానన్నారు. వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేలా ప్రయత్నిస్తాని చెప్పారు. నాలుగో అతిపెద్ద జనాభా గల బుడగ జంగాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ ఏ, బీ, సీ, డీలుగా కావాల్సిన దాన్ని ఏ, బీ, సీ లుగా మార్చారని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం తమ పోరాటం న్యాయమైందని సుప్రీం కోర్టు చెప్పిందని అప్పుడు దళిత మేధావులు ఎక్కడికి పోయారన్నారు. నిన్నటి వరకు వర్గీకరణను వ్యతిరేకించిన వారు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సబ్ కమిటీ చైర్మన్‌ను కలిసి తమ విజ్ఞప్తులు చేస్తామన్నారు.
11 శాతం వాటా న్యాయమైన హక్కు
దళితుల్లో మాదిగల జనాభా ప్రకారం 11 శాతం వాటా అడగటం తమ న్యాయమైన హక్కు అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌మాదిగ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమం కో ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, జనాభా సంఖ్య ప్రకారం వాటా కోరడం తమ జాతి మనోవేదన, ఆకాంక్ష అన్నారు. ఆయనవెంట కో ఆర్డినేటర్లు దరువు ఎల్లన్న, నలిగంటి శరత్‌చమార్, గిద్దె రాంనర్సయ్య, భరత్, కొమ్ము సోమశేఖర్, బుర్రి సతీష్ ఉన్నారు.
టీజేయూ 2025 డైరీ ఆవిష్కరణ
తెలంగాణ జర్నిలిస్ట్ యూనియన్ (టీజేయూ) రూపొందించిన 2025 డైరీ, క్యాలండర్‌లను ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నేతకాని వెంకటేష్, టీజేయూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ, టీజేయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బింగి. స్వామి, ఉపాధ్యక్షులు దాసన్న కార్యదర్శులు చింతల కృష్ణ , బాపురావు, మారేపల్లి కృష్ణ, కనకారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, సునీత కృష్ణమూర్తి శ్రీకాంత్ చారీ, శ్రీనివాస్, రాజు, సత్యం, బిట్టు, శరత్, తదితరులు పాల్గొన్నారు.