calender_icon.png 19 January, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతాళ గంగ పైపైకి!

06-09-2024 01:34:41 AM

  1. జూలైలో 10.74 మీటర్ల లోతుకు జలాలు 
  2. వరుసగా కురుస్తున్న భూగర్భజలం పుష్కలం 
  3. ప్రస్తుతం 5.66 మీటర్ల లోపే జలాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): వేసవి ఆరంభంలోనే గ్రేటర్‌లోని పలు చోట్ల బోర్లు అడుగంటడంతో నీటి కొరత ఏర్పడుతుందేమోనని నగరవాసులు ఆందోళన చెందారు. జూన్, జూలైలో నూ జలమండలి సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లపైనే స్థానికులు ఆధారపడిన విష యం తెలిసిందే. కానీ వర్షాకాలం ఆరంభం లో కురిసిన వర్షాలకు తోడు గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు నగరంలో భూగర్భ జలాలు పెరిగాయి.  జూలైలో 10.74 మీటర్ల లోతుకు పడిపోయిన పాతాల గంగ ఆగస్టులో కురిసిన వర్షాలకు  5.66 మీటర్లకు పైకి వచ్చింది. అంటే దాదాపు 5.08మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. సైదాబాద్, హిమాయత్‌నగర్, చార్మినార్ మండలాల్లోని పలు ప్రాంతాలు మినహా భూగర్భ జలాలు గతం కంటే పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

నిండు కుండలా చెరువులు కుంటలు..

నగరంలో సగటున 462 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. కానీ ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకే 522 మి.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని చెరువులు, కుంటలు, సరస్సులు ప్రస్తుతం నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. వీటిలో ఎంత ఎక్కువ నీటి నిల్వలు ఉంటే అంత ఎక్కువగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. గతేడాది కంటే 0.56 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. 2023 ఆగస్టులో 6.22 మీటర్లలోతులో భూగర్భ జలాలు ఉండగా 2024 ఆగస్టు నాటికి 5.66 మీటర్ల లోతులోకే వచ్చాయి.  ఈ నెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పాతాళ గంగ మరింత పైకి వచ్చే అవకాశం ఉంది.

వర్షపు నీటిని ఒడిసి పట్టు..

నగరంలో నీటిఎద్దడికి అధికారులు ఏప్రిల్, మే, జూన్, జూలైలో ప్రతిరోజు 12 వేల వాటర్ చొప్పున సరఫరా చేయాల్సి వచ్చింది. దీంతో వాటర్ ట్యాంక్‌ల బుకింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. తద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నం కొంతమేరకు సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.  నగరంలోని దాదాపు 50శాతం ఇండ్లకు ఇంకుడు గుంతలు లేవు. అందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని పర్యావేత్తలు చెప్తున్నారు.

భూగర్భజలాలు మరింత పెరిగే అవకాశం.. 

భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. వర్షం నీరు భూమిలోకి ఇంకేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది. నీటి వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రతి ఇంటోల ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. 

  -కే లక్ష్మా, భూగర్భజల శాఖ, డైరెక్టర్