calender_icon.png 15 March, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయంతో బిక్కుబిక్కుమంటూ విమాన రెక్కలపై..

15-03-2025 12:16:51 AM

  • అమెరికాలో విమానంలో చెలరేగిన మంటలు
  • ప్రాణభయంతో విమానం రెక్కల మీద నిల్చున్న ప్రయాణికులు
  • తృటిలో తప్పిన పెను ప్రమాదం

డెన్వర్, మార్చి 14: అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. కొలరాడో స్ప్రింగ్స్ అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి డల్లాస్ ఫోర్ట్ వర్త్‌కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో ఏర్పడ్డ సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి. గాలిలో ఉండగానే.. ఇంజిన్‌లో వైబ్రేషన్స్‌ను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని డెన్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

విమానం కిందికి దిగిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది అందులో ఉన్న ప్రయాణికులను అత్యవసర ద్వారాల గుండా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులు విమాన రెక్కల మీద నిల్చొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఎమర్జెన్సీ ద్వారాల ద్వారా బయటకు వచ్చిన ప్రయాణికులు విమానం రెక్కలపై నిల్చున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.

విమానంలో ఉన్న ప్రయాణికుల్లో 12 మంది ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలవగా.. ఆసుపత్రికి తరలించినట్లు డెన్వర్ విమానాశ్రయ అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన సిబ్బందికి ధన్యవాదాలు’ అని విమానయాన సంస్థ ప్రకటించింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు.