calender_icon.png 16 November, 2024 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17న అట్టహాసంగా విమోచన వేడుకలు

15-09-2024 02:55:23 AM

  1. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహణ 
  2. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ గైర్హాజరు
  3. వేడుకల ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఎంపీ లక్ష్మణ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  రాకపోవడం విచారకరమన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. త్వరలో కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని ధ్వజమెత్తారు.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే విమోచన వేడుకల ఏర్పాట్లను శనివారం లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఏనాడు రాష్ర్ట ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదని, అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా గత మూడేండ్లుగా నరేంద్రమోదీ ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఈ వేడుకలకు గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారని గుర్తు చేశారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ ప్రత్యేకతను వెలుగులోకి తీసుకొచ్చి, అమరవీరుల పోరాటగాథలను కళ్లకు కట్టేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. బీఆర్‌ఎస్ మాదిరిగానే దారుస్సలాం ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

ప్రజాపాలన అంటే ప్రజలను తప్పదోవపట్టించడమే

తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవానికి బదులు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించడం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని లక్ష్మణ్ అన్నా రు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా మోదీ సర్కార్ విమోచన దినోత్సవాన్ని జరుపుతుంటే .. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజాపాలన పేరు తో కార్యక్రమాలను జరుపతూ నిజాం రాజు చేసిన ఆగడాలను మరుగున పడేలా చేస్తుందన్నారు.

హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి విముక్తి పొందినప్పటికీ కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారో చెప్పాలన్నారు. రష్యా సహకారంతో రాష్ట్రంలో కమ్యూనిస్ట్ రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా మిలటరీతో పోరాటాలు చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభు త్వం కండ్లు తెరుచుకుని, తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేసేలా... తెలంగాణతో వల్లభాయ్ పటేల్ కున్న అనుబంధాన్ని తుంచేసేలా వ్యవహరిస్తున్నారన్నారు.

బైరాన్‌పల్లి నుంచి మొదలుకొని పరకాల వంటి పోరాట కేంద్రాలను స్ఫూర్తి కేంద్రాలుగా, మ్యూ జియాలుగా తీర్చిదిద్దే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై ఉందని లక్ష్మణ్ అన్నారు. మాజీ శాసన సభ్యులు చింతల రాంచంద్రారెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.