మనిషి నిద్రలో ఉన్నా మేల్కొని ఉండేదెవరన్న ఆలోచన ఆ ధ్యాత్మ సాధనలో ప్రధానమైంది. మనిషి మూడు స్థితులలోనూ సంచారం చేస్తాడు.
మొదటిది: జాగ్రదవస్థ. అంటే, మేల్కొని ఉండే అవస్థ. దీంట్లో ఇంద్రియాలన్నీ ప్రాపంచిక కలాపంలోనూ, అదే సమయంలో ప్రపంచాతీతమైన కార్యక్రమంలోనూ నిమగ్నమై ఉంటయ్.
రెండవది: స్వప్నావస్థ. అంటే నిద్రావస్థ. ఇంద్రియాలు తమ కార్యకలాపాల ను అన్నింటినీ ఆపి విశ్రమించే ప్రయత్నంలో ఉంటయ్. ఇంద్రియాలన్నీ ఆ సమయంలో మనసులో లయించి ఉంటయ్. ఆ కారణంగా మనిషి అప్పటి దాకా తాను జీవించిన ప్రపంచం నుంచి దూరమవుతాడు.
కానీ, ప్రాణశక్తులు తమ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా కొనసాగిస్తూనే ఉంటయ్. శరీరం లోపల ఉన్న ప్రధాన అవయవాలు తమ పని తాము చేస్తూనే ఉంటయ్. రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. శ్వాస ఆడుతూనే ఉంటుంది. ప్రపంచంలో స్వయంగా చూసిన దృశ్యాలను మనసు చూపిస్తూనే ఉంటుంది.
విన్న పాటలను వినిపిస్తూనే ఉంటుంది. అనుభవించిన అనుభవాలను స్మృతిగా నెమరు వేసుకుంటూనే ఉంటుంది. జరగకుండా మిగిలిపోయిన విషయాలు కలలు గా రూపు దిద్దుకుంటూనే ఉంటయ్. ఈ అవస్థ జాగ్రదావస్థ కంటే చిన్నది.
మూడవది: సుషుప్తి అవస్థ. ఈ అవస్థ పై రెండు అవస్థలకంటే మరింత చిన్నది. ఈ అవస్థ కలకు, మెలకువకు, ఇలకు మధ్యన ఉండేది. ఈ అవస్థ, మనసు, ఇంద్రియాలు మరింతగా పలుచబడి లోక లోకాంతర ప్రాణాలు అనుభవ పరిధిని దాటుతూ అనుభూతి స్థాయిని క్రమంగా అందుకుంటయ్. ఇక్కడే మనసు శుభ్రమనసుగా రూపుదిద్దుకొని మనిషికి హాయిని కలిగిస్తుంది. ఇటువంటి మనసునే దైవంగా భావించి ఇంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ప్రశాంతత అనుభవమవుతుంది.
అనుభవ స్థితిని దాటి, శూన్య స్థితిని అంటే పూర్ణ స్థితిని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, అచ్చంగా అనుభూతిమయమయ్యే అమదానంద స్థితి ఇది. ఏ పనీ చేయకుండానే, ఏ అనుభవమూ లేకుండానే, ఏ ప్రయోజనమూ పొందకుండానే, నిద్ర లేస్తూనే ‘రాత్రంతా హాయిగా ఉన్నాను’ అని ప్రకటించటం అద్భుతం. ఈ హాయిని అనుభవించిందెవరని ప్రశ్నించుకున్నప్పుడు, మూడు అవస్థలలోనూ సంస్థితమైన ‘ఆత్మ’ లేదా అసలు ‘నేను’ మాత్రమే.
ఈ సుషుప్తి అవస్థ పరిపూర్ణ అధ్యాత్మ భూమిక. కనుకనే మనిషి జీవితానికి పరమ చరమమైన ఆత్మానుభవం తద్వా రా కలిగే అనుభూతి, తదనంతరం నిలకడ చెందే పరమశాంతి, చరమసుఖం ఎక్కడో బయట లేవని ఉన్నదంతా తనయందే ఉన్నదన్న స్పృహలో జీవితాన్ని పరిపూర్ణంగా అధ్యాత్మమయం చేసుకోవడమే పరమావధి. ఇది అవధులు దాటిన బ్రహ్మానంద సాగరపు ఆవలిగట్టు.
సుఖమంతా దేహపరం; సంతోషమంతా మనోగతం; ఆనందమంతా హృదయగతం! హృదయం, ‘నేను’కు ఆరామ స్థలి. అదే చైతన్య స్థలి.
మూడు అవస్థలలోనూ మనిషి ధర్మబద్ధంగా జీవించాలి. బయట వెన్నెలను, కాంతిని దాటి, ఆంతరంగికమైన పెనువెలుగును దర్శించాలి. దీనిని సాధించగల శక్తి మనిషికి మాత్రమే సాధ్యం!... అవస్థా త్రయాన్ని, అన్ని అవస్థలలో ఉన్న ‘నేను’ను పరిచయం చేస్తున్న మహర్షికి వినమ్రంగా ప్రాంజలి ఘటిస్తున్నారు, ఆరుగురు జిజ్ఞాసువులు!
ఇంతటి మహత్తర భూమికను అందుకునే ఉపాయాన్ని, మార్గాన్ని మహర్షి సూచిస్తారన్న నిరీక్షణతో జిజ్ఞాసువుల మనసులు తహతహలాడుతున్నయ్.
వి.యస్.ఆర్.మూర్తి