తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు విషయమై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ పేర్కొంది. స్వీకరించిన అభ్యంతరాలు, సూచనలపై రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీసీ కమిషన్ ఈ నెల 28న ఆదిలాబాద్, 29న నిజామాబాద్, 30న సంగారెడ్డి, నవంబర్ 1న కరీంనగర్, 2న వరంగల్, 4న నల్గొండ, 5న ఖమ్మం, 7న రంగారెడ్డి, 8న మహబూబ్‌నగర్, 11న హైదరాబాద్ జిల్లాల్లోని కలెక్టరేట్ల సముదాయాల్లో బహిరంగ విచారణలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. కమిషన్ ప్రధాన కార్యాలయంలో నవంబర్ 11న ప్రత్యేకంగా ఎన్‌జీఓలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, 13న సాధారణ ప్రజల కోసం బహిరంగ విచారణ ఉంటుందని చెప్పింది. వచ్చే నెల 13వ తేదీ వరకు వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా కమిషన్ కార్యాలయంలోనూ తమ అభ్యంతరాలు, సూచనలను సమర్పించవచ్చని తెలిపింది.