calender_icon.png 30 September, 2024 | 4:45 AM

అక్టోబర్ 5న విద్యాశాఖ కార్యాలయం ముట్టడి

30-09-2024 12:18:05 AM

డీఎస్సీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): డీఎస్సీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5న పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాలపై విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.

ఫైనల్ కీ విడుదల చేసి 25 రోజులు కావొస్తుందని, ఇంత వరకు ఫలితాలు విడుదల చేయకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనమన్నారు. ఫైనల్ కీ తప్పులపై కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

11,062 టీచర్ పోస్టుల భర్తీకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసి త్వరితగతిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఫైనల్ కీలో తప్పులను సరి చేయడంతోపాటు, స్పోర్ట్స్ కోటాలో రూల్స్ ప్రకారం అన్ని క్రీడా సర్టిఫికెట్స్‌లకు అనుమతినివ్వాలని, ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టుల్లో అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను ఓపెన్‌లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు.