calender_icon.png 24 October, 2024 | 3:55 PM

కరెంటు బిల్లుపై.. కన్వీనియన్స్

09-08-2024 01:55:52 AM

  1. వినియోగదారులను దోపిడీ చేస్తున్న విద్యుత్తు శాఖ 
  2. టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో బిల్లు కడితే..  కన్వీనియన్స్ ఫీజు పేరుతో రూ.2.77 వసూలు
  3. జీహెచ్‌ఎంసీ పరిధిలో బిల్లు కట్టిన 13,31,895 మంది
  4. వీరి నుంచి అదనంగా రూ.36,89,349 వసూలు
  5. దోపిడీపై వినియోగదారుల ఆగ్రహం

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసించే రజనీదేవి ఇంటికి జూలైలో విద్యుత్ బిల్లు రూ.680 (యూఎస్‌సీ నంబర్ 110343 627) వచ్చింది. ఈ బిల్లును టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా చెల్లించగా వినియోగదారు ఖాతా నుంచి రూ.682.77 కట్ అయ్యాయి. రూ.680కి యాప్‌లో కన్వీనియన్స్ ఫీజు రూపంలో అదనంగా రూ.2.77 చెల్లించాల్సి వచ్చింది.

అదే మీటర్ (యూఎస్‌సీ నంబర్ 110343627) కు జూన్ నెలలో రూ.889 బిల్ వచ్చింది. ఈ బిల్‌ను ఫోన్‌పే ద్వారా చెల్లించగా అదనంగా ఒక్క పైసా కట్ కాలేదని రజనీదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ యాప్ వినియోగదారులకు మేలు చేసేలా ఉండాలి కానీ, అదనపు భారం వేస్తారా? అని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్య ఆమె ఒక్కరిదే కాదు.. టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులందరి నుంచీ ఇలాగే లక్షల్లో కన్వీనియన్స్ ఫీజు పేరుతో అదనంగా గుంజుతున్నారు.

యాప్ ద్వారా అదనపు వడ్డన తప్పదు

టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో సుమారు 1.13 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. 85 లక్షల గృహ కనెక్షన్లు ఉండగా, వ్యవసాయ కనెక్షన్లు 13లక్షలు ఉన్నాయి. మిగిలినవి కమర్షియల్ కనెక్షన్లు. వీరిలో ఇప్పటి 46,30, 969 మంది వివిధ రకాల ఆన్‌లైన్ సేవల ద్వారా  విద్యుత్ బిల్లు చెల్లించారు. 13,31,895 మంది వినియోగదారులు టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా బిల్లు చెల్లించారు.

వీరిలో ప్రతి వినియోగదారుడి నుంచి రూ.౨.౩౫ నుంచి ౨.౭౫ వరకు మొత్తం 13,31,895 మంది వినియోగదారు నుంచి కన్వీనియన్స్ ఫీజు రూపంలో రూ.36,89,349 వసూలు చేశారు. బిల్లు ఎంట్రీ చేసిన సమయంలో కాకుండా బిల్ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే కన్వీనియన్స్ ఫీజు కనిపిస్తున్నదని వినియోగదారులు వాపోతున్నారు. టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్‌ను 2024 జూలై 29వ తేదీ వరకు 17,52,487 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 

అసౌకర్యంగా మొబైల్ యాప్

ప్రస్తుతం విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వినియోగిస్తున్న టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ అసౌకర్యంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మొదట యూఎస్‌సీ నంబర్ నమోదు చేయాలి. తర్వాత బిల్ చెల్లించే విధానం ఎంపిక చేసుకోవాలి. ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్/క్యాష్ కార్డు, క్యూఆర్, యూపీఐ పేమెంట్స్ వంటి ఆన్‌లైన్ సేవలకు సంబంధించి ఆరు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఇంటర్నెట్ బ్యాకింగ్ ఎంపిక చేయగానే బ్యాంకు పేరు అడుగుతుంది.

ఒక బ్యాంకును ఎంపిక చేసుకున్న తర్వాత కార్డు నంబర్, సీవీవీ (కార్డు వెరిఫికేషన్ వాల్యూ) నంబర్‌ను నమోదు చేయాలి. పేమెంట్‌కు ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే కన్వీనియన్స్ ఫీజుతో పాటు జీఎస్‌టీ కలిపి ప్రతి బిల్లు చెల్లింపులపై రూ.2.77లను అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెప్తున్నారు. ఈ ఐదు స్టెప్‌లలో ఎందులో ఏ చిన్న పొరపాటు జరిగినా వినియోగదారుడు నష్టపోవడం ఖాయం. ఇది అత్యంత కఠినంగా ఉందని అంటున్నారు.

మొబైల్ యాప్ అమల్లోకి రావడానికి ముందు విద్యుత్ బిల్లును ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఒక్కపైసాఅదనపు రుసుము లేకుండా చెల్లించేవారమని చెప్తున్నారు. పైగా ఒక్కసారి ఫోన్‌పేలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే ప్రతినెలా బిల్ జనరేట్ కాగానే ఆ నెల ఎంత బిల్లు వచ్చిందనేది నోటిఫికేషన్ వచ్చేది. బిల్ అలర్ట్ నోటిఫికేషన్ వస్తుండటంతో విద్యుత్ వినియోగదారులు బిల్లులు సకాలంలో చెల్లిం చేవారు. ప్రభుత్వానికి కూడా వెంట వెంటనే బిల్లులు జమ అయ్యేవి. చదువు రానివారు కూడా ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా సులభంగా విద్యుత్ బిల్లులను చెల్లించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదని వినియో గదారులు వాపోతున్నారు. 

థర్డ్‌పార్టీ చెల్లింపులను నిరాకరించడంతో..

రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు టీజీఎస్‌పీడీసీఎల్ సంస్థ బిల్లు చెలింపుల కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో 2024 జూలై 1వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా నేరుగా విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవలు నిలిచిపోయాయి. అయితే టీజీఎస్‌పీడీసీఎల్ యాప్‌లోకి వెళ్లిన తర్వాత యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. కానీ అదనపు భారం మాత్రం వినియోగదారులు భరించాల్సిందే. ఈ అదనపు దోపడీపై స్పష్టత కోసం టీజీఎస్‌పీడీసీఎల్ టెక్నికల్ ఏఈని ఫోన్‌లో సంప్రదించగా ఈ అంశం తమ పరిధిలో లేదని జవాబు చెప్పారు.