calender_icon.png 22 September, 2024 | 4:31 AM

రేషన్‌కార్డుల జారీకి పాత నిబంధనలే!

22-09-2024 01:21:27 AM

రూల్స్ మారిస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం

నిబంధనలు మార్చాలని ప్రభుత్వానికి విన్నపాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కార్డుల ఎంపిక విషయంలో నిబంధనలు మార్చాలని పలువురు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ఎంపికలో పాత నిబంధనలనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిబంధనలు మారిస్తే కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండు నెలల క్రితం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కొత్త రేషన్‌కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేయనుంది.

కార్డుల జారీకి విధించే ఆదాయ పరిమితిపై అంతర్గతంగా చర్చించిన కమిటీ పాత పద్ధతికే మొగ్గుచూపినట్లు సమాచారం. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధివిధానాలను అధ్యయనం చేశారు. నివేదికలో పలు మార్పులు చేసి ఉపసంఘానికి అందజేయగా, దానిపై చర్చలు జరిపి ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా విధానాలు రూపొందించాలని సూచించినట్లు తెలిసింది.

రాష్ర్టంలో రేషన్‌కార్డులను పలు సంక్షేమ పథకాలకు సైతం ప్రామాణకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్, హెల్త్‌కార్డుల జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గత ప్రభుత్వాల విధానాల అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణంలో రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకోనున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి అయితే 7 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేయనున్నట్లు సమాచారం. రాష్ర్టంలో 89.96 లక్షల మందికి రేషన్ కార్డులుండగా, వాటి పరిధిలో 2.65 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.