ఇరవై మూడు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’ కొత్త సీసాలో పాత సారాలా ఉంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు రూపాంతరమే ఈ కొత్త పథకం. 2004కు పూర్వం నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం ఉండేది. నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, కార్పొరేటీకరణల వల్ల పాలకులు ఉద్యోగుల సంక్షేమా న్ని పక్కనబెట్టి అమలులో ఉన్న పాత పెన్షన్ స్కీంకు బదులు కొత్త పెన్షన్ స్కీమ్‌ను తెచ్చారు. పాత పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత లభించేది. ఈ పరిధిలోని ఉద్యో గికి రిటైర్మెంట్ సమయంలో 50 శాతం పెన్షన్, ఒకవేళ ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులకి 30 శాతం ఫ్యామిలీ పెన్షన్, నిర్ణీత గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి అదనపు సౌకర్యాలు ఉండేవి.
2004లో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. 2004 జనవరి1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ను వర్తింపజేస్తూ అప్పటి భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పింఛన్ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్వయించుకొని వారి ఉద్యోగులకు అమలు చేయడం ప్రారంభించాయి.
సీపీఎస్ ఉద్యోగి తన బేసిక్ పే (మూల వేతనం), డీఏ (కరువు భత్యం)లో కలిపి 10 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌గా, ప్రభుత్వం నుంచి మరో 10 శాతం సొమ్మును నేషనల్ పెన్షన్స్ స్కీం ట్రస్ట్‌లో జమ చేస్తారు. ఉద్యోగికి కేటాయించబడిన పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ఖాతాలో ఈ మొత్తం సొమ్ము జమవుతుంది. ఉద్యోగి పదవీ విరమణ పొందే వరకు కూడిన మొత్తం సొమ్ము నుండి 60 శాతం డబ్బు మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40 శాతం భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారీ పెన్షన్ కింద రిటైరైన ఉద్యోగికి చెల్లిస్తారు. నూతన పెన్షన్‌ను అమలు చేస్తున్నప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు ప్రారంభించాయి. రెండు దశాబ్దాలుగా వారి ఆకాంక్షలను పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలపైనే బాధ్యత
ఉద్యోగి సొమ్మును ఎన్నో ఒడుదొడుకులతో కూడిన స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం వల్ల ఆర్థిక భద్రత లోపిస్తుంది. ఉద్యోగంలో ఉండగా మరణించిన సందర్భాలలో వారికి వచ్చే పెన్షన్లు ప్రభుత్వాలు ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ. దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలు సామాజిక ఆర్థిక భద్రత కరువై వీధుల్లో పడ్డాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు సీపీఎస్ గుదిబండగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు దీని రద్దు కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసుకొని పోరాటాలు చేస్తున్నాయి.
సీపీఎస్ అమలును ప్రారంభించినప్పుడే వాటి ఫలితాలను అంచనా వేసిన వామపక్ష పార్టీలు, మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి. వీరి ఆకాంక్షలను గుర్తించిన కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి, విజయం సాధించాక దేశంలోని రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలు ఓపీఎస్‌ను పునరుద్ధరించడం ప్రారంభించాయి.
దీనివల్ల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రంపై కూడా ఒత్తిడి పెరిగింది. ఉద్యోగుల అనేక పోరాటాల ఫలితంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని, దాని స్థానంలో ఉద్యోగుల సంక్షేమం కోసం మేలైన పథకాన్ని తీసుకొస్తామని పార్లమెంట్‌లో ప్రకటించి ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘమైన సమీక్షల అనంతరం ఎన్‌పీఎస్‌లో చేయాల్సిన మార్పులపై యుపీఎస్‌ను సూచిస్తూ కేంద్రానికి కమిటీ సిఫారసు చేసింది. ఇటీవల కేంద్ర క్యాబినెట్ యూనిఫైడ్ పెన్షన్స్ స్కీమ్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యూపీఎస్ 1 ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి రానుంది. యూపీఎస్‌లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైన చేరితే అదనపు భారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.
స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులు వద్దు
ఉద్యోగి పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూల వేతన సగటులో 50 శాతం పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్‌కు కనీస సర్వీసు 25 ఏళ్లు ఉండాలి. పెన్షన్‌దారుడు మరణించాక వారి భాగస్వామికి 60 శాతం పెన్షన్ అందే అవకాశం ఉంది. ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ రూ.10,000కు అర్హత సాధించాలంటే కనీస సర్వీసు పదేండ్లు ఉండాలి. యూపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14.5 శాతం నుంచి 18 శాతం పెరుగుతుంది. పాత పింఛను పథకంతో పోలిస్తే ఈ యూపీఎస్‌లో ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ అదనంగా ఉంది.
పెన్షన్‌పై పీఆర్‌సీ అమలు లేకపోవడం భవిష్యత్‌లో ఉద్యోగి వచ్చే పెన్షన్‌లో పెరుగుదల ఉండదు. ఉద్యోగుల సొమ్ము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా కార్పొరేట్లకు లాభార్జన చేకూరేలా చేస్తూ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నూతన ఒరవడిలో ఉద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఓపీఎస్ ద్వారా మాత్రమే ఉద్యోగు లకు సామాజిక ఆర్థిక భద్రత కలుగుతుంది.
పాకాల శంకర్ గౌడ్