హైకోర్టు ఆదేశాల మేరకు మృతదేహం వెలికితీత
త్రివేండ్రం, జనవరి 16: కేరళ రాజధాని త్రివేండ్రంలో వృద్ధుడి సజీవ సమాధి ఘటన కలకలం రేపుతున్నది. గోపన్‌స్వామి అలియాస్ మణ్యన్ సజీవ సమాధి అయ్యారని ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు తాము నివసిస్తున్న ప్రాంతంలో ఫ్లెక్సీలు పెట్టారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఓ ఆలయం సమీపంలో సమాధిని గుర్తించారు. సమాధి తవ్వకూడదని స్థానికంగా ఒత్తిళ్లు రావడంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. సమాధిని తవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో గురువారం ఉదయం యంత్రాంగం సమాధి స్థలానికి చేరుకున్నారు. సమాధిని తవ్వి వృద్ధుడి మృతదేహాన్ని బయటకు తీయించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం త్రివేండ్రం మెడికల్ కాలేజీకి తరలించారు. తవ్వకాలు జరుపుతున్న ప్పుడు మృతుడి కుటుంబ సభ్యులు పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ మృతదేహాన్ని బయటకు తీయించారు.