calender_icon.png 22 April, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడిని బలి తీసుకున్న పాత కక్షలు

21-04-2025 12:00:00 AM

స్నేహితుల మధ్య పాత కక్షల నేపథ్యంలో నాగోల్ ఫ్లై ఓవర్ వద్ద యువకుడి హత్య 

కేసు దర్యాప్తు చేస్తున్న చైతన్యపురి పోలీసులు 

ఎల్బీనగర్, ఏప్రిల్ 20 : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో యువకుడు హత్య గురయ్యాడు. ఈ ఘటనలో మనోజ్ (24) అనే వ్యక్తి  అక్కడికక్కడే మృతి  చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...ఓల్ నాగోల్ విలేజ్ లో పంగ మనోజ్(24, మధు(26) ఇద్దరు అన్నదమ్ములు తల్లి, చెల్లితో కలిసి నివసిస్తున్నారు. వీరి తండ్రి భిక్షపతి చనిపోయాడు.

అయితే, మనోజ్ తన స్నేహితుడు బందెల వంశీ (21)తో కలిసి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో స్కూటీ పై నాగోల్ ఫ్లై ఓవర్ యూటర్న్ దగ్గర ఉన్న రాజుగారి బిర్యానీ హోటల్ దగ్గర ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేయడానికి వెళ్లారు. అదే సమయంలో మనోజ్ స్నేహితుడు నాగోల్ లోని జైపురికాలనీకి చెందిన సంజయ్ తన స్నేహితులతో కలిసి వచ్చాడు. స్కూటీపై కూర్చుని టిఫిన్ చేస్తున్న మనోజ్ పై పాత కక్షల నేపథ్యంలో సంజయ్ కత్తితో దాడి చేశాడు.

స్నేహితుల సాయంతో సంజయ్ పలుమార్లు కత్తితో మనోజ్ పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దాడిని అడ్డుకోబో యిన వంశీపై దాడి చేసి, గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న మనోజ్ అన్న మధు వెంటనే తల్లి, చెల్లితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.  ఈ సందర్భంగా మృతుడి సోదరుడు మధు మాట్లాడుతూ.. 2023  ఏప్రిల్ లో మా తమ్ముడు, అతడి స్నేహితుడు సంజయ్ మధ్యన గొడవ జరిగింది. ఈ విషయంపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ పై  కేసు నమోదైనట్లు తెలిపాడు. కొన్ని రోజుల క్రితం పెద్దల సమక్షంలో సంజయ్ రూ. 3  లక్షలు తీసుకొని  కేసులో రాజీ పడ్డాడు.  కానీ  సంజయ్... పాత కక్షలు మరిచిపోకుండా మా తమ్ముడు మనోజ్ ను హత్య చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.