19-04-2025 12:00:00 AM
మంచిర్యాల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : జిల్లాలో 2024- యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, రైస్ మిల్లర్లు పాత బకాయిలు పూర్తి చేసి బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నా రు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ చాం బర్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి బాయిల్ రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర తో వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, సన్న బియ్యంకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. బాయిల్ రైస్ మిల్లర్లకు గతంలో కేటాయించిన వరిధాన్యం లక్ష్యాలకు సంబంధించి పాత బకాయిలు లేకుండా పూర్తి చేయాలని, బ్యాంక్ గ్యారంటీలు వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో ఈ సీజన్‌లో ధాన్యం కేటాయించడం జరుగదని తెలిపారు.
ధాన్యం దిగుమతి ఎలాంటి కోతలు లేకుండా చేయాలని తెలిపారు. రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే సమయంలో నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, బాయిల్ రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.