calender_icon.png 3 October, 2024 | 5:46 AM

బీజేపీలో పాత, కొత్త పంచాదీ

03-10-2024 02:14:14 AM

సర్కార్‌పై పోరుకు నేతల మధ్య అనైక్యత

లీడర్ల తీరుపై క్యాడర్‌లో అసంతృప్తి

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై బీజేపీ పోరాటానికి పూనుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని అమ లు చేయలేదని కమలం పార్టీ విమర్శిస్తూ వస్తోంది.

రైతాంగం కోసం వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ.. రైతు హామీల సాధన కోసం కమలం ప్రతినిధులు సెప్టెంబర్ 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 24గంటల దీక్ష చేపట్టారు.

కాషాయదళం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ దీక్షకు పార్టీ సీనియర్ నాయకులైన కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌తో పాటు ముఖ్యనేతలు హాజరుకాలేదు. దీంతో పార్టీలో నివురుగప్పిన నిప్పు లా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి.

బీజేపీలో అంతే..

బీజేపీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీ లు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీశ్‌బాబు దీక్షలో కూర్చున్నారు.

అయితే దీక్షకు సీనియర్ నేత ల నుంచి పెద్దగా సహకారం అందలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు కూడా రాకపోవడం గమనార్హం. పార్టీ ఎమ్మెల్యేలైన పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాజాసింగ్ సైతం గైర్హాజరయ్యా రు.

ప్రతిపక్షంపై చేపట్టిన పోరులో పాత నేతలు కలిసిరాకపోవడంతో బీజేపీలో అంతే అనే చర్చ షురువైంది. కొందరు నేతలు పార్టీలోకి వచ్చి ఐదారేళ్లు అవుతున్నా ఇంకా కొత్తే మిటని వాపోతున్నట్లు తెలుస్తోంది. పాత, కొత్త తారతమ్యాలు చూపితే పార్టీకి నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా సభ్యత్వ నమోదులో తలమునకలై ఉన్నందువల్లే నిరసన దీక్షకు ముఖ్యనేత ల్లో కొందరు గైర్హాజరు అయ్యారని తమ పార్టీ శ్రేణులకు సర్ది చెబుతున్నారు. 

పదాధికారులు సైతం..

పార్టీ రాష్ట్ర పదాధికారులు సైతం నిరసన దీక్షలో పాల్గొనకపోవడం సైతం చర్చకు తావిస్తోంది. సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మినహాయిస్తే.. నలుగురు రాష్ర్ట ప్రధాన కార్యదర్శుల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక్కరే పాల్గొన్నారు. మిగతా ప్రధాన కార్యదర్శులు, రాష్ర్ట ఉపాధ్యక్షులైన చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, గంగిడి మనో హార్ రెడ్డి, లక్ష్మీనారాయణ, రాష్ర్ట కార్యదర్శులు, అధికార ప్రతినిధులు కనిపించలేదు. 

రాష్ట్రాధ్యక్షుడి గైర్హాజరుపై పెదవి విరుపు!

బీజేపీ దీక్ష సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 1వ ఉదయం 11 గంటలకు ముగిసింది. జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మరుసటి రోజైనా హైదరాబాద్ వచ్చి దీక్ష ముగింపు కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ నేత లు ఆశించారు. కానీ ఆయన రాలేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సైతం ప్రారంభోత్సవం రోజున హాజరై తిరిగి కశ్మీర్ వెళ్లిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.