calender_icon.png 25 October, 2024 | 3:50 AM

కాంగ్రెస్‌లో చల్లారని పాత, కొత్త లొల్లి

25-10-2024 01:41:31 AM

  1. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాత నేతలకు పొసగని వైనం
  2. నిత్యం ఘర్షణలు.. ఒకరిపై ఒకరు విమర్శలు.. కలిసి నడవని క్యాడర్ 
  3. నాయకుల మధ్య సయోధ్యకు మెకానిజం ఉందంటున్న  పీసీసీ అధ్యక్షుడు  

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): హస్తం పార్టీలో పాత, కొత్త పంచాదీ చల్లారడం లేదు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో కలిసిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గా ల్లో రోజుకో వివాదం కొనసాగుతోంది. నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కలిసి నడవడం లేదనే చర్చ సాగుతోంది.

దీంతో అధికార కాంగ్రెస్‌లో ఎవరికివారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి నెల కొంది. పార్టీ నాయకులు, క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోవడం, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నాయకులు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికను తీవ్రంగా వ్యతిరేకిం చారు.

అయినా వారి మాటలను పరిగణనలోకి తీసుకోకుండానే కాంగ్రెస్ రాష్ట్ర నాయక త్వం చేరికలకు పచ్చజెండా ఊపింది. నామినేటెడ్ పోస్టుల్లోనూ సీనియర్లకు ప్రాధాన్యమి వ్వకుండా.. కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ రాష్ట్రం లో పదేండ్లు అధికారంలో లేకపోయినా.. తాము బీఆర్‌ఎస్ ఆగడాలను తట్టుకొని పార్టీ కోసం పని చేశామని పాత నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత హత్యతో మళ్లీ తెరపైకి..

తాజాగా జగిత్యాలలో మాజీమంత్రి, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యాఘటన.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో జీవన్‌రెడ్డి తీవ్ర మనస్థానం చెందారు. తాజాగా బీఆర్‌ఎస్ నుం చి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కుమా ర్ అనుచరులే హత్యా రాజకీయాలకు పాల్పపడ్డారని విమర్శించారు. ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉన్నా.. చేరికలు అవసరమా? రాహుల్‌గాంధీ విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరుగుతున్నాయని జీవన్‌రెడ్డి గళమెత్తారు. 

మిగిలిన చోట్లలోనూ పొసగడం లేదు..

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడం.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడంపై పీ విజయారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ జిల్లా పార్టీ అంతర్గత సమావేశంలో దానం నాగేందర్ తీరుపై విజయారెడ్డి అసంతృప్తి వ్యక్తి చేశారు. దీంతో పీసీసీ నుంచి ఆమెకు షోకాజ్ నోటీసులు వచ్చాయి. పార్టీ అంతర్గత సమవేశాల్లో మాట్లాడితే షోకాజ్ నోటీసు పంపడమేంటని, తానేమి బహిరంగ విమర్శలు చేయలేదని విజయారెడ్డి వాపోయినట్లు సమాచారం. 

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరికను కూడా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి  ఓడిన సరితా తిరుపతయ్య యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు సాగుతున్నాయి. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గాల మధ్య కూడా నిత్యం తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా, ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మూడు దశాబ్దాలుగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో కేసులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి తమపై పెత్తనం చేస్తున్నారని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పాత కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరికతో.. పాత కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన భీం భరత్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాలే యాదయ్య పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీం భరత్ కేవలం 200లకు పైచిలకు ఓట్లతోనే ఓటమి చెందారు.

దీంతో భీం భరత్‌పై ప్రజల్లో సానుభూతి ఉందని, ఈ సమయంలో కాలే యాదయ్య చేరిక అవసరమా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాత కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న పంచాయతీపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ.. ప్రభుత్వం సుస్థిరత కోసమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తున్నారని, నాయకుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మెకానిజాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.