calender_icon.png 11 January, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారానికి 4 సిఫార్సులకు ఓకే

31-12-2024 03:07:05 AM

* తిరుమలలో పరిగణలోకి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు

* అంగీకారం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

* అధికారికంగా ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

* కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్, స్పీకర్ ప్రసాద్‌కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సులను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుట్టదాఖలు చేస్తుందనే విమర్శలకు ఏపీ ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టిం ది. ఇక నుంచి వారంలో నాలుగు సిఫార్సులను పరిగణలోకి తీసుకోనున్నది. ఈ మేర కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంగీకారం తెలిపారని తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.

సోమవారం ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయి పలు అంశాలను చర్చించారు. వీటిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల అంశమూ చర్చకు వచ్చింది. సీఎం వారానికి నాలుగు సిఫార్సు లేఖలను అనుమతించాలని సూచించినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.

వారానికి రెండు బ్రేక్ దర్శనాలు (రూ.500 టికెట్), రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన సిఫార్సులకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. ఇదే అంశంపై గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

ఇక నుంచి ఎలాంటి విమర్శలకు తావు ఉండొద్దనే ఏపీ ప్రభుత్వం తాజాగా సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలు బలోపేతం చేసేందుకే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అంగీకరిస్తున్నట్లు ఏపీ సీఎం తిరిగి తెలంగాణ సీఎంకు లేఖ రాశారు.

ఏపీ సీఎంకు కృతజ్ఞతలు..

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీ సీఎం తాజాగా సిఫార్సులకు అంగీకారం తెలపడంతో ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తిరుమలతో తెలంగాణ ప్రజలకు విడదీయలేని బంధం ఉందని, ఏటా నుంచి వేలాది మంది భక్తులు వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్తుంటారన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రకటించారు.

అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి  కూడా ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో భక్తులకు శీఘ్రంగా వెంకటేశ్వరస్వామి దర్శనం, సులువుగా వసతి దొరకుతుందన్నారు.

వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు

జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కలిగించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేగవంతం చేసింది. పదిరోజుల పాటు ప్రతిరోజూ 70,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నది.

ఇప్పటికే టీటీడీ పోర్టల్‌లో శ్రీవాణి పేరిట టిక్కెట్లు విడుదల చేసింది. భక్తులు రూ.300 స్పెషల్ దర్శన టికెట్‌తో స్వామివారిని దర్శించుకోవచ్చు. అలా పది రోజుల్లో సుమారు 4 లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారని టీటీడీ అంచనా వేసింది.